ఈ నెల 9వ తేదీ మంగళవారం రావులపాలెం సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, కానిస్టేబుల్ ప్రసాద్లపై ఎసిబి అధికారుల దాడి వెనుక కొంతమంది స్వార్థ పరులు కుట్రతో ప్రణాళిక ప్రకారం పక్కా పకడ్బందీగా ముందస్తు వ్యూహంతో వారిని పట్టించారని రావులపాలెం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు దుయ్యబట్టారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులందరూ ఎస్సై వెంకటరమణ కానిస్టేబుల్ ప్రసాద్ లకు సంఘీభావంగా స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ కు వెళ్ళి ఎస్సై పై కుట్రపూరిత అవినీతి కేసును ఖండిస్తూ ఇంఛార్జ్ ఎస్సై ప్రేమ్ కుమార్ కు మెమోరాండమ్ ను అందజేశారు.
ఈ సందర్భంగా మురళి కృష్ణ, పమ్మి నరేష్, షేక్ అజహర్ లు మాట్లాడుతూ పక్కా మాస్టర్ ప్లాన్ తో కుట్రపూరితంగా రావులపాలెం ఎస్సై ను ఇరికించడం చాలా బాధాకరమని తెలిపారు. సామాన్య కుటుంబంలో జన్మించిన వెంకటరమణ కష్టపడి చదివి పోలీసు శాఖలో పనిచేయాలనే లక్ష్యంతో ఎస్సై పోస్టుకు ఎంపికయ్యారని తెలిపారు వివాదరహితుడిగా, సౌమ్యుడిగా పేరు సంపాదించుకున్న మంచి అధికారికు ఇలా జరగడం ప్రతి ఒక్కరిని కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పగలనక రాత్రనక ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీస్ అన్నకు ఇలా జరగడం నిజంగా అవాంఛనీయమైన సంఘటన అని వాపోయారు. రావులపాలెంలో ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సమర్థవంతంగా తన విధి నిర్వహణలో, అనునిత్యం శాంతి భద్రతలు కాపాడటంలో సిన్సియర్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్సై వెంకటరమణ అన్ని వర్గాల నుండి ఆదరణ పొందారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.