జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) పార్ట్‌టైమ్ సభ్యుడిగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి ఎంపికయ్యారు. ఎన్‌ఎంసీలో పార్ట్‌టైమ్ సభ్యులుగా పది రాష్ట్రాలకు చెందిన హెల్త్ యూనివర్సిటీల వీసీలను తీసుకున్నారు. వీరి ఎంపిక కోసం ఢిల్లీలోని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం ఓ కార్యక్రమం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన దరఖాస్తుల నుంచి డ్రా పద్ధతిలో పది మంది పార్ట్‌టైమ్ సభ్యులను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎంపిక చేయగా.. వీరిలో డాక్టర్ కరుణాకర్‌రెడ్డి పేరు కూడా ఉంది. నిబంధనల ప్రకారం రెండేళ్లకు ఒకసారి డ్రా పద్ధతిలో పార్ట్‌టైమ్ సభ్యులను ఎంపిక చేస్తారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్స్ నుంచి 9 మందిని డ్రా పద్ధతిలో ఎంపిక చేయగా.. వీరిలో మన రాష్ట్రం నుంచి ఎవరికీ అవకాశం రాలేదు. ఈ డ్రాలో ఆంధ్రప్రదేశ్ నుంచి డాక్టర్ బి.సాంబశివరావు పేరు వచ్చింది.