ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలోని జగన్నాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు పాఠశాల బాలికలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బాలికలు ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. బాలికల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వారు చెప్పారు.మయూర్‌భంజ్ జిల్లాలోని రస్‌గోవింద్‌పూర్ ప్రాంతంలోని హ్రుదానంద హైస్కూల్‌కు చెందిన 70 మంది బాలబాలికల బృందంలో భాగమైన విద్యార్థులు క్రిస్మస్ సెలవుల సందర్భంగా పిక్నిక్ కోసం పూరీకి వచ్చినట్లు పోలీసు అధికారి తెలిపారు. రాత్రి 8 గంటల సమయంలో ఆలయానికి 22 మెట్లు ఎక్కుతుండగా బాలికలు తొక్కిసలాటలో చిక్కుకుని స్పృహతప్పి పడిపోయారని ఆలయ కార్యాలయ అధికారి తెలిపారు. గాయపడిన బాలికలు 9, 10 తరగతుల విద్యార్థులని, వారిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించామని ఆలయ అధికారులు చెప్పారు.