రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో శరవేగంగా వెళ్తున్న వెంకటాపూర్ గ్రామానికి చెందిన సుమారు పది ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామంలో ఇసుక ట్రాక్టర్లు వేగాన్ని తగ్గించి నడపాలని, లేదంటే ఇసుక ట్రాక్టర్లు బొప్పాపూర్, గొల్లపల్లి గ్రామాల మీదుగా వెళ్లకుండా అడ్డుకుంటామని గ్రామస్తులు తెలిపారు. ట్రాక్టర్ ఓనర్లు సంఘటన స్థలానికి రావాలని గ్రామస్తులు కోరగా, అక్కడికి చేరుకున్న ఓనర్లకు గ్రామస్తులకు మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. ఇసుక ఇల్లు నిర్మించుకునే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుందని మేము ఇసుకను అడ్డుకోమని ట్రాక్టర్లు వేగాన్ని తగ్గించి నడపాలని ఓనర్లను, డ్రైవర్లను గ్రామస్తులు హెచ్చరించారు. ట్రాక్టర్ డ్రైవర్లు మాట్లాడుతూ, మాకు రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉందని తెలిపారు. రెవెన్యూ అధికారుల పర్మిషన్ ఉంటే శరవేగంగా ట్రాక్టర్లు నడపమని రెవెన్యూ అధికారులు చెప్పారా అని గ్రామస్తులు కోపోద్రోక్తులయ్యారు. ప్రతి ట్రాక్టర్ కు ఇసుక పర్మిషన్లు తక్కువ ఇవ్వాలంటూ అధికంగా ఇవ్వడంతో ట్రాక్టర్ ఓనర్లు, డ్రైవర్లు డబ్బు మత్తులో పడి శరవేగంగా నడుపుతున్నారని, ప్రజల ప్రాణాలు పోతే రెవెన్యూ అధికారులు కూడా బాధ్యత వహించాలని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై రమకాంత్, ఏఎస్ఐ కిషన్ రావు మరియు పోలీసు బృందాన్ని సంఘటన స్థలానికి పంపి ట్రాక్టర్ డ్రైవర్లు ఓనర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏఎస్ఐ కిషన్ రావు మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామానికి చెందిన ఊరడి మహేష్ కంటైనర్ కింద పడి తల పగిలి చనిపోయాడని గుర్తు చేస్తూ ట్రాక్టర్లు శరవేగంగా వెళ్తే వాటి కింద గ్రామ ప్రజలు పడి చనిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తుల ప్రాణాలు దృష్టిలో ఉంచుకొని ట్రాక్టర్ డ్రైవర్లు గ్రామంలో వేగాన్ని తగ్గించి నడపాలని హెచ్చరించారు లేని యెడల ట్రాక్టర్ డ్రైవర్లు ఓనర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇదే చివరి హెచ్చరికగా గుర్తు చేస్తూ మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకూడదని తెలిపారు.