Monday, February 9, 2026
spot_img
HomeTELANGANAజమ్మికుంట పూర్వనామం, చరిత్ర తెలుసుకోండి

జమ్మికుంట పూర్వనామం, చరిత్ర తెలుసుకోండి

పాత పేరు ‘దమ్మెకుంట’
1932 న రైల్వే స్టేషన్‌లో గాంధీజీ ప్రసంగించిన సందర్భం
వాణిజ్యకేంద్రంగా వర్ధిల్లుతున్న పట్టణం. చుట్టూ ఉన్న గ్రామాలకు కేంద్రబిందువు.

కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట పట్టణం ప్రముఖ వ్యాపార కేంద్రంగా వర్ధిల్లుతోంది. వాణిజ్యానికి కేరాఫ్ అనే మాదిరిగా పట్టణంలో పలు వ్యాపారాలు సాగుతున్నాయి. కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని ఈ పట్టణానికి రోడ్డు, రైలు మార్గాలు ఉండటంతో ప్రజలకు రవాణా మార్గం సులువుగా ఉంటుంది. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రాష్ట్రంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒకటి.

‘జమ్మికుంట శాసనం’ వేయించిన రెండో తైలపుని రాజు.

చరిత్ర ప్రకారంగా జమ్మికుంటకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. పాత జమ్మికుంట చెరువు కట్ట దగ్గర శివాలయం ముందు ఉన్న చారిత్రక శాసనం ప్రకారం..పశ్చిమ చాళుక్య రాజు అహో మల్లపదేవుడు 10వ శతాబ్దంలో ‘జమ్మికుంట శాసనం’ వేయించారు. రెండో తైలపునిగా ప్రసిద్ధి గాంచిన ఈయన పారమార రాజ్యమైన ఉప్పాలపై దండెత్తి విజయం సాధించిన సందర్భంగా ఈ శాసనం వేయించారు.

ప్రస్తుత రంగమ్మపల్లి-జగ్గయ్యపల్లి గ్రామాలకు పశ్చిమాన ఒక గ్రామం ఉండేదని, అది అప్పటి సైనిక స్థావరమని శాసనం ద్వారా తెలుస్తున్నది. ఆ శాసనం ప్రకారం ‘‘దమ్మెకుంటె’’ అనే పేరు కాలక్రమంలో ‘జమ్మికుంట’గా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాత పేరును పరిశీలిస్తే..అది చాళుక్యులకు ముందు బౌద్ధ మత ప్రాబల్యం గల ప్రాంతం కాబట్టి ‘‘దమ్మి’’అనే సంస్కృత పదం.. ‘‘కుంటె’’ అనే కన్నడ పదాల కలయిక ద్వారా వచ్చినట్టుంది. దమ్మి అంటే తామర, కుంటె అనగా కొలను..అంటే ‘‘తామర కొలను’ అని అర్థం.

‘గాంధీ చౌక్’ చరిత్ర
హైదరాబాద్- న్యూ ఢిల్లీ రైలు మార్గాన్ని నూతనంగా 1931-32లో మొదటి రైల్వే లైనుగా వేశారు. ఆ సమయంలో మహాత్మా గాంధీ ఈ మార్గం గుండా ప్రయాణిస్తున్నట్టు తెలియడంతో జమ్మికుంట పరిసర ప్రాంతాల్లోని చుట్టు పక్క ఉన్న ఊర్ల జనం ఎడ్ల బండ్లు కట్టుకుని జమ్మికుంట రైల్వే స్టేషన్‌కు వచ్చారు. చుట్టు పక్కల ఊర్ల గ్రామస్తులు వచ్చారని తెలిసి గాంధీ జమ్మికుంటలో కొన్ని నిమిషాల పాటు రైలు ఆపి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దానికి గుర్తుగానే 1946 ఫిబ్రవరిలో గాంధీ చౌక్ నిర్మాణం జరిగింది. రైల్వే స్టేషన్ రాకతో దీనిని స్టేషన్ జమ్మికుంట అని పిలుస్తున్నారు.

ఇక పాత జమ్మికుంటను ‘ఆబాది జమ్మికుంట’ పిలవడం ప్రారంభమైంది. ఆబాది అంటే అభివృద్ధి చెందిన బస్తీ అని అర్థం. గాంధీ విగ్రహ ప్రతిష్టాపన పలువురు ప్రముఖుల విరాళాలతో ‘జై హింద్’ పేరున జరిగింది. విగ్రహాన్ని మద్రాస్(చెన్నయ్) నుంచి తీసుకొచ్చారు. దీనికి ఆనాటి కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేటర్ ఎ.సత్యనారాయణ మూర్తి నవంబర్ 3, 1949న శంకుస్థాపన చేయగా, నాటి హైదరాబాద్ ప్రభుత్వ ప్రధాన మంత్రి ఎం.కె.వెల్లోడి ఫిబ్రవరి 5, 1950న ఆవిష్కరించారు. ఫిబ్రవరి 6, 1950న గ్రేన్ మార్కెట్ ప్రారంభించారు.

పురాతన కేంద్రాలు
1992లో ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) జమ్మికుంటలో ఏర్పాటు చేశారు. గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థ ఈ కేంద్రాన్ని స్థాపించగా, భారత వ్యవసాయ పరిశోధనా మండలి, న్యూ ఢిల్లీ వారి సహకరంతో ఇది పని చేస్తున్నది. పురాతన దేవాలయాలు కూడా జమ్మికుంట, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి. బిసుగిరి దర్గాగా పిలువబడే హజ్రత్ అలీ, రహమతుల్లా వలీ సమాధులు సుమారు 800 సంవత్సరంలో నిర్మించారు. ఇల్లందకుంటలోని సీతారామచంద్రస్వామి వారి దేవాలయం పురాతనమైనది. దీని నిర్మాణ సమయ ఆనవాళ్లు చరిత్రలో అలభ్యంగా ఉన్నాయి. 1931లో పీవీ నరసింహారావు వివాహం ఈ ఆలయంలోనే జరిగింది.

1939లో బొమ్మలగుడి..
1939లో విశ్వేశ్వరస్వామి ఆలయం (బొమ్మలగుడిని ).. నిర్మించారు. పెసరుబండ రాళ్లు దీనికి వాడారు. 1950 ప్రాంతంలో అనుగం కుటుంబీకులు హనుమాన్ టెంపుల్ నిర్మించారు. 1996లో అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్ ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు హాస్పిటల్ ఉండేదని చరిత్ర చెప్తోంది. దానిని ‘‘కరోడ్‌గిరి’’ అని పిలిచేవారట. నిజాం కాలంలో రజాకార్ల నాయకుడిగా ఉన్న ఖాసీం రజ్వి 1946-48 మధ్య కాలంలో జమ్మికుంటను సందర్శించినట్టు చరిత్ర పేర్కొంటోంది. తెలంగాణ రైతాంగా సాయుధ పోరాటంలో నిజాం వ్యతిరేక ఆందోళన సమయంలో ‘‘ఆర్య సమాజ్’’శాఖ జమ్మికుంటలో చురుకుగా పని చేసినట్టు హిస్టరీ వెల్లడిస్తోంది.

1924లో ఉప్పుడు బియ్యం మిల్లు
జమ్మికుంట వ్యాపార ప్రస్థానం 1924లో ఉప్పుడు బియ్యం మిల్లుతో ప్రారంభమైంది. కొండూరి వారితో పాటు మార్వాడి, పట్కారి, గుజరాతీ కుటుంబాలకు చెందిన వారు వ్యాపారాలను ప్రారంభించారు. అటుకుల మిల్లు సమీప పరిసర ప్రాంతాలకు గేటు కింద ఉన్నది సుపరిచితమే. జమ్మికుంటలో 1948లో ప్రభుత్వ పాఠశాల, 1965లో ఆదర్శ డిగ్రీ కాలేజీ, 1973లో శిశుమందిర్, 1976లో ప్రైవేటు రంగంలో శ్రీనివాస ఇంగ్లిష్ మీడియం స్కూల్ ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments