కడప, జనవరి 2: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి ఈరోజు(మంగళవారం) ఇడుపులపాయకు రానున్నారు. ఈ క్రమంలో ఇడుపులపాయపై వైసీపీ పెద్దలు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈరోజు రాత్రికి షర్మిల ఇడుపులపాయలోనే బస చేయనున్నారు. దీంతో రాష్ట్రంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇడుపులపాయలో షర్మిలను కలుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ వర్గాలు ఇడుపులపాయపై ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు ఇడుపులపాయలో షర్మిల పర్యటన కడప జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్‌లో చేరికపై….
కాగా.. వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 4న షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు 4న ఢిల్లీకి రావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి షర్మిలకు ఆహ్వానం కూడా వెళ్లింది. దీనిపై మరికొద్దిసేపట్లో ఇడుపులపాయ వేదికగా షర్మిల ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 4న ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో షర్మిల చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే షర్మిల ఏపీ కాంగ్రెస్‌లో చేరనున్న నేపథ్యంలో పలువురు వైసీపీ నేతలు అటు వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ అధిష్టానం దృష్టి షర్మిల పర్యటనపై పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇడుపులపాయకు రాక.. కారణమిదే…
మరోవైపు వైఎస్ షర్మిల కుటుంబ సమేతంగా నేడు పులివెందుల పర్యటనకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్‌ను సందర్శించనున్నారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రిక ఘాట్ దగ్గర ఉంచి.. షర్మిల కుటుంబసభ్యులు ఆశీస్సులు తీసుకోనున్నారు. కాగా తెలుగు ప్రజలందరికీ వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. న్యూఇయర్ విషెస్‌తో పాటు మరో తీపి కబురును కూడా ప్రజలతో పంచుకున్నారు. అదే షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి విషయం. ఈ సంవత్సరంలో తన కుమారుడి వివాహం జరుగనున్నట్లు తెలిపారు. వైఎస్ రాజారెడ్డికి, అట్టూరి ప్రియతో వివాహం నిశ్చయం అయినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ రాజారెడ్డి, ప్రియల నిశ్చితార్థ వేడుక తేదీ, పెళ్లి డేట్‌ను షర్మిల ప్రకటించారు.