తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్ధిక సంవత్సరంలో 3,000 కోట్ల రూపాయలు మైనార్టీ సంక్షేమానికి కేటాయించి వాస్తవానికి కేవలం 700 నుండి 800 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని ఆ ఖర్చు కూడా మైనార్టీ కార్పొరేషన్, వక్ఫ్ బోర్డు, ఉర్దూ అకాడమీ సంస్థల, ఇమామ్, మౌజన్ ల జీతభత్యాలకు, షాది ముబారక్ పథకానికి ఖర్చు చేసిందే తప్ప, ముస్లింల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆ బడ్జెట్ నిధుల నుండే ముస్లింలకు అవసరంలేని ఇఫ్తార్ విందు పేరిట రెండేళ్లలో దాదాపు 150 కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేసిందని ఇఫ్తార్ విందు పేరిట ఖర్చు చేసిన 150 కోట్లతో ఒక్కొక్క ముస్లిం యువకునికి లక్ష రూపాయలు రుణాలు ఇచ్చినా దాదాపు 15 వేల మంది పేద ముస్లింలకు లాభం చేకూర్చేదన్నారు తెలంగాణ ముస్లిం సంఘాల జే.ఏ.సీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ అహ్మద్ ఖాన్.
నేడు మహబూబాబాద్ లో ఆయన మీడియా తో మాట్లాడుతూ ముస్లింలకు కేటాయించిన నిధులను వృధా ఖర్చులు చేస్తూ, దారి మళ్లిస్తూ, బడ్జెట్లో మాత్రం గొప్పగా కేటాయిస్తున్నట్లు, మైనార్టీ సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం చెప్పుకోవడం మంచి పద్ధతి కాదని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ బడ్జెట్లో 3,700కోట్ల రూపాయలకు పైగా కేటాయించిన నిధులను “నిరుద్యోగ ముస్లిం యువకులకు రుణాలు ఇచ్చి వాళ్ళ అభివృద్ధికి” తోడ్పడాలని, మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్ పూర్తిస్థాయిలో మైనార్టీలకే ఖర్చు చేయాలని కోరుతున్నామన్నారు.


