నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా పోరాటం చేసిన గొప్ప యోధుడు కొమరం భీమ్ అని ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్క అన్నారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి గ్రామంలో ఆదివారం కొమరం భీమ్ విగ్రహాన్ని సుగుణక్క భుజంగరావు దంపతులు ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ అడవిని జీవనోపాధిగా చేసుకొన్న కొమరం భీమ్ నిజాంలను ఎదురించాడని తెలిపారు. నిజాం సైనికులకు వ్యతిరేకంగా ఆయుధాలతో పోరాటం చేశాడని, పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించాడని. జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో ఉద్యమించి వీరమరణం పొందాడని కొనియాడారు. కొమరం భీమ్ ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీక అని తెలిపారు. ఆదివాసీల క్షేమం కోసం చివరి వరకు పోరాడిని గొప్ప యోధుడని ప్రశంసించారు.ఆయన ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆదివాసి గిరిజనులకు రాబోవు రోజుల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తామని తెలిపారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన సుగుణక్కకు ఆదివాసి సాంప్రదాయం ప్రకారం చిన్నారులు ముత్యాలు చేస్తూ స్వాగతించారు. ఈ కార్యక్రమంలో కుమురం భీమ్ మనుమడు సోనేరావు, ఆదివాసి సీనియర్ నాయకులు కుమురం మాంతయ్య, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సిడాం గణపతి, గ్రామ పెద్దలు సోయం మనోహర్, గావుడే పురుషోత్తం, సోయం సంతోష్, సీనియర్ నాయకులు బోర్కుటే విట్టల్, ఉప సర్పంచ్ బండు, ఎంపీటీసీ సుమన్ బాయి తదితరులు పాల్గొన్నారు.