హైదరాబాద్: తన కుమార్తె కల్వకుంట్ల కవితను పార్టీ మారమని భారతీయ జనతా పార్టీ నేతలు అడిగారని, ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉందా అని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ బాడీ కీలక సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలపై బీజేపీ సర్కార్ కుట్రలు చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. కేంద్రానికి ఏపీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నా.. వైసీపీని దెబ్బతీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందన్నారు. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని కేసీఆర్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై పార్టీ మారాలని ఒత్తిడి చేస్తున్నారని… ఎవరెవరు ఏం చేస్తున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో తనకు అన్నీ తెలుసని, జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు. ఎవరూ బీజేపీకి లొంగవద్దని, సమావేశం వివరాలు ఎక్కడ బయటకు చెప్పొద్దని కేసీఆర్ నేతలకు స్పష్టం చేశారు. అందరిపై నిఘా ఉందని కేసీఆర్ చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తే లేదని, ఈసారి కూడా సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ బాడీ కీలక సమావేశంలో కేసీఆర్ మునుగోడు ఫలితాలపై కూడా సమీక్ష జరిపారు. మునుగోడులో సరిగ్గా పనిచేయని మంత్రులకు క్లాస్ తీసుకున్నారు. కనీసం ఐదుగురు మంత్రులు ఇంఛార్జ్‌లుగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి 85వేలకు పైగా ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కేవలం 10వేల మెజార్టీతో గెలవడంతో… తమకు మెజార్టీ ఇంత స్థాయిలో తగ్గుతుందని హించలేకపోయామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఫలితాలు వెలువడిన రోజే ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికల ద్వారా బీజేపీ రోజురోజుకూ బలపడుతోందని రుజువైంది. దీంతో రెండు పార్టీల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా నువ్వా నేనా అనే వాతావరణం ఏర్పడిందని పరిశీలకులు చెబుతున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు.