బ్రిస్బేన్ : బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీతో టెన్నిస్ పునరాగమనం చేసిన మాజీ నెంబర్ వన్ నవోమి ఒసాక (జపాన్) శుభారంభం అందుకుంది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో 6-3, 7-6 (9)తో తమార కోర్పా్‌షపై ఆమె సునాయాసంగా గెలుపొందింది. నాలుగు గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్ అయిన26 ఏళ్ల ఒసాక..బిడ్డకు జన్మనివ్వడం కోసం 16 మాసాలు టెన్ని్‌సకు దూరంగా ఉంది. నిరుడు జూలైలో ఆమెకు కూతురు జన్మించింది. సుదీర్ఘ విరామం తర్వాత ఆడిన మొదటి మ్యాచ్ ఆసాంతం ఎంతో ఒత్తిడికి లోనైనట్టు ఒసాక చెప్పింది. టెన్నిస్ ఆడడం లేదా కూతుర్ని నిద్రపుచ్చడంలో ఏది సులువు అన్న ప్రశ్నకు ‘షాయ్ (కూతురు)ని నిద్రపుచ్చాలంటే తలప్రాణం తోకకు వస్తోంది. ఆమెకు తరచూ డైపర్లు మారుస్తూ ఉండాలి. అందువల్ల డైపర్లు మార్చడం కన్నా టెన్నిస్ మ్యాచ్ ఆడడమే ఈజీ’ అని ఒసాక నవ్వుతూ బదులిచ్చింది.