వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని అత్తెల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటి కరెంట్ బిల్లు విషయంలో తండ్రీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదం ఒక ప్రాణాన్ని బలిగొంది. అత్తెల్లి గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వారు నివాసం ఉంటున్న ఇంటి కరెంటు బిల్లు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. బిల్లును నువ్వు కట్టు అంటే.. నువ్వు కట్టు.. అంటూ పరస్పరం గొడవకు దిగారు.
ఈ గొడవ తారస్థాయికి చేరింది. దీంతో ఈ తండ్రీకొడుకుల మధ్య ఘర్షణ గ్రామ పెద్దల వరకు వెళ్లింది. గ్రామ పెద్దలు మాట్లాడుతుండగానే తండ్రి రామచంద్రయ్యపై కుమారుడు యాదయ్య రాడ్డుతో దాడి చేశాడు. దీంతో రామచంద్రయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే పంచాయతీ పెద్దలు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యాదయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్ పోలీసులు తెలిపారు..