Sunday, April 27, 2025
spot_img
HomeANDHRA PRADESHసునీల్‌ కుమార్‌కు ‘ఫైర్‌’

సునీల్‌ కుమార్‌కు ‘ఫైర్‌’

అమరావతి: సీఐడీ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధికారిగా పేరొందిన పీవీ సునీల్‌ కుమార్‌… అఖిల భారత సర్వీసు అధికారిగాకంటే… ‘నిబద్ధత కలిగిన’ వైసీపీ కార్యకర్తగా, ముఖ్యమంత్రి జగన్‌కు నమ్మిన బంటుగానే పేరుపొందారు. చట్టం, నీతి, రీతిని కాదని… ప్రభుత్వ పెద్దలు చెయ్యమన్న పనులన్నీ చేశారు. ‘వారి కళ్లలో ఆనందం కోసం’ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణ రాజును శారీరకంగా హింసించారనీ ఆరోపణలూ ఎదుర్కొన్నారు. అధికారంలో ఉన్న వారికోసం అన్ని గీతలు చెరిపేసి మరీ ‘సేవలు’ చేసినా… పోస్టింగ్‌ విషయంలో ప్రభుత్వం ఆయనను ‘మంటల్లో’కి తోసేసింది. ఏమాత్రం ప్రాధాన్యం లేని రాష్ట్ర విపత్తులు, ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. సీఐడీ చీఫ్‌ ఎన్‌.సంజయ్‌ని ‘ఫైర్‌ సర్వీసెస్‌’ ఇన్‌చార్జిగా అదనపు బాధ్యతల నుంచి రిలీవ్‌ చేసింది. గురువారం రాత్రి దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. ‘కాబోయే డీజీపీ సునీల్‌ కుమార్‌’ అనే స్థాయిలో ప్రచారం జరగ్గా… చివరికి ఇలా అప్రాధాన్య పోస్టులోకి పంపించడం ఐపీఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ పెద్దల ఆజ్ఞానుసారం పనిచేస్తూనే… మరోవైపు, ‘తాడేపల్లి’కి తెలియకుండా సొంత వ్యవహారాలు నడిపారని, అది జీర్ణించుకోలేకే సునీల్‌ కుమార్‌పై వేటు వేశారని ప్రచారం జరుగుతోంది.

ఆకస్మికంగా వేటు…

సునీల్‌ కుమార్‌ను జనవరి 23వ తేదీన ప్రభుత్వం సీఐడీ చీఫ్‌ పోస్టు నుంచి పక్కకు తప్పించింది. సునీల్‌ కుమార్‌కు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించినందునే ఇలా పక్కనపెట్టారనే వాదన వినిపించినప్పటికీ అందులో నిజం లేదని చెబుతున్నారు. సునీల్‌ కుమార్‌పై ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్రం నుంచి ఎన్ని లేఖలు వచ్చినా… రాష్ట్ర ప్రభుత్వం సింపుల్‌గా పక్కనపెట్టేసింది. సునీల్‌ కుమార్‌ను కాపాడుకుంటూ వచ్చింది. కానీ… అకస్మాత్తుగా ఆయనను పక్కన పెట్టేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లు వింటూనే, ఆయన శ్రుతిమించి సొంత వ్యవహారాలు నడిపినట్లు తేలిందని, అందుకే వేటు వేశారని ప్రచారం జరిగింది. అయితే… తనను డీజీపీగా నియమిస్తారని, మరింత ప్రాధాన్యమున్న పోస్టు లభిస్తుందని సునీల్‌ కుమార్‌ అనుయాయులతో ప్రచారం చేయించుకున్నారు. కానీ… రోజులు గడుస్తున్నా ఆయనకు పోస్టింగ్‌ దక్కలేదు. కొన్నాళ్ల పాటు విదేశాల్లో గడిపి తిరిగొచ్చిన ఆయన తాడేపల్లికి వెళ్లి…. తాను ఆశిస్తున్న పోస్టుల్లో నియమించాలని కోరినా ఫలితం రాలేదు. చివరికి… ‘ఏదో ఒకటి, ఎక్కడో ఒక చోట’ అని బతిమలాడుకోవడంతో… శాంతి భద్రతలతో సంబంధంలేని అప్రాధాన్య పోస్టు ఇచ్చినట్లు తెలిసింది.

ఎంత ఏకపక్షంగా చేసినా…

అంతుచిక్కని కేసులు, ఆర్థిక మోసాల్లాంటి వ్యవహారాలను నిగ్గు తేల్చే సీఐడీ విభాగం… సునీల్‌ కుమార్‌ హయాంలో తీవ్ర వివాదాస్పదమైంది. ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులు పెట్టి వైసీపీ చట్టాన్ని అమలు చేశారు. సోషల్‌ మీడియాలో పోస్టుల పేరిట వృద్ధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులనూ అరెస్టు చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా బీభత్సం సృష్టించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టినా… వెతికి, వెంటాడి పట్టుకున్నారు. కానీ… హైకోర్టు న్యాయమూర్తుల్ని దూషించిన వైసీపీ శ్రేణులను మాత్రం వదిలేశారు. సోషల్‌ మీడియాలో ముఖ్యమంత్రి జగన్‌ను సునీల్‌ కీర్తించిన తీరు చెప్పనలవి కాదు. ఎంత ఏకపక్షంగా పనిచేసినా, ఎంత భక్తుడిలా మారినా… ‘తాడేపల్లి’కి కోపం వస్తే అంతే అని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments