రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు సురేందర్ రావు ఆధ్వర్యంలో స్థానిక ఏఎమ్ఆర్ గార్డెన్ లో బిఆర్ఎస్ కార్యకర్తలతో, నాయకులతో ఏర్పాటు చేసిన పార్లమెంట్ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ముందుగా బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఫైర్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డమైన హామీలు ఇచ్చిందని, ఎందుకు ఆ మాట నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గెలిపించాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలను కార్యకర్తలకు, నాయకులకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. కాంగ్రెస్,బిజెపిపై తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేయకపోతే ప్రజల చేతిలో పరాభావం తప్పదని హెచ్చరించారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులను, చేనేత కార్మికులను ఆదుకున్నామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పనులను నిలుపుదల చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నేతన్నలు రోడ్డుపై పడ్డారన్నారు. ఇదే విషయంపై మంత్రి తుమ్మలను కలిసి వివరిస్తే తనకేం తెలియదని పైనుండే అనడం విడ్డూరం అని అన్నారు. ఎల్ఆర్ఎస్ పై క్షేత్రస్థాయిలో పోరాటాలకు పిలుపు ఇస్తున్నట్లు తెలిపారు. 6 తేదీన జరిగే సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో ధర్నా కార్యక్రమానికి టిఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని, రైతులకు నీళ్లు ఇవ్వకుండా, కేసీఆర్ పై బురద జల్లుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేకే మహేందర్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ పై తీవ్రస్థాయిలో కేటీఆర్ మండిపడ్డారు. కరీంనగర్ ను ఏం అభివృద్ధి చేశారో చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఒక పిల్లర్ కి మాత్రమే పగుళ్లు వచ్చాయని, దానికే లక్షల కోట్లు మేము వెనకేసుకున్నాం అని అనడం సరికాదన్నారు.
లోకసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కలిసికట్టుగా పనిచేయాలని లేకపోతే పార్లమెంట్ లో తెలంగాణ ఉనికి లేకుండా పోతుంది అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ గళం వినిపించాలంటే వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్ కొండూరు రవీందర్ రావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట అగయ్య, ఎంపీపీ జనగామ శరత్ రావు, మాజీ రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజి రెడ్డి, ప్యాక్స్ పోతుగల్ చేర్మెన్ తన్నీరు బాపు రావు, ఎర్రవెల్లి చంద్ర శేఖర్ రావు, అక్కరాజు శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జానా బాయి, కాసుగంటి శ్రావణ్ రావు, సర్వర్,విజయ రామరావు, కొమ్ముబాలయ్య, సంతోష్ రావు, శీలం స్వామి, మెంగని మనోహర్, మాజీ సర్పంచ్ గాండ్ల సుమతి, ధబ్బేడ రేణుక, ఎంపీటీసీ కంచం మంజుల, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎద్దండి నర్సింహారెడ్డి, బీఆర్ఎస్వి మండల అధ్యక్షుడు ఎండి నవాజ్, వివిధ గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, నాయకులు పాల్గొన్నారు.