నూతన సంవత్సరం రోజున ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులను వెదజల్లుతూ రాకెట్ నింగిలోకి విజయవంతంగా వెళ్లింది. దీంతో ఈ ఏడాది ఇస్రోకు శుభారంభం లభించింది. కొత్త సంవత్సరం మొదటి రోజున చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడం శుభపరిణామం. ఎక్స్‌రే మూలాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి సోమవారం ఉదయం 9:10 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ నింగిలోకి ప్రవేశించింది. ఈ పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ ద్వారా 480 కిలోల ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని (ఎక్స్‌పోశాట్) నింగిలోకి పంపించారు. ఈ ఎక్స్‌పో శాట్‌తోపాటు కేరళ యూనివర్సిటీ విద్యార్థులు రూపొందించిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్వీ-సీ58 రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. ఎక్స్‌పోశాట్‌తోపాటు మొత్తం పది బుల్లి ఉపగ్రహాలను కూడా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అంతరిక్ష రహస్యాల కోసం ఈ ఎక్స్‌పోశాట్‌ను రూపొందించారు. ఇది టెలిస్కోప్‌లా పనిచేస్తూ ఖగోళంలో బ్లాక్ హోల్స్, పాలపుంతలు, ఎక్స్ రే కిరణాలపై పరిశోధన చేయనుంది. కాగా ఎక్స్‌పోశాట్ జీవిత కాలం ఐదేళ్లు.
పీఎస్‌ఎల్వీ-సీ58కు సంబంధించిన కౌంట్‌డౌన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభించారు. కౌంట్‌డౌన్ జరిగే సమయంలో రాకెట్‌కు ఇంధనాన్ని నింపి, గ్యాస్ ఫిల్లింగ్ చేశారు. రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరును శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగానికి సిద్ధం చేశారు. ఇస్రో ప్రయోగించిన తొలి పోలారిమెట్రీ మిషన్ ఇదే. అమెరికాకు చెందిన నాసా 2019లో చేపట్టిన ఇమేజింగ్ ఎక్స్-రే పోలారిమెట్రీ ఎక్స్‌ప్లోరర్ (ఐఎక్స్‌పీఈ) తర్వాత మరో దేశం చేపట్టిన పోలారిమెట్రీ మిషన్ ఇదే కావడం గమనార్హం. కాగా ఇస్రో చరిత్రలో ఇప్పటివరకు 59 పీఎస్‌ఎల్వీ ప్రయోగాలు జరిగాయి. ఇది 60వది. పోలార్ శాటిలైట్ లాంచి వెహికల్ ప్రయోగాలు ఇప్పటివరకు పీఎస్‌ఎల్వీకి బాగా కలిసొచ్చాయి. ఈ నేపథ్యంలో ఇస్రో ఈ ఏడాదిని పీఎస్‌ఎల్వీ ప్రయోగాలతోనే ప్రారభించడం గమనార్హం.