‘‘అప్పు చేసి పప్పుకూడు’’ చందంగా ఉంది రాష్ట్రంలో కొత్త పోర్టుల నిర్మాణం తీరు. సముద్ర వాణిజ్యంలో 2024 నాటికి రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం రెండు విడతలుగా 4 కొత్త మేజర్ పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తొలిదశలో భావనపాడు, రామాయపట్నం మేజర్ పోర్టులతోపాటు 4 ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టింది. నిర్మాణానికి నిధులు లేక, వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పరిమితికి మించి ఓవర్ డారఫ్ట్‌ను వినియోగించుకుని అప్పులు చేసింది. ఇక ఎక్కడా అప్పులు పుట్టకపోవడంతో.. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎ్‌ఫసీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్(ఆర్‌ఈసీ) నుంచి అప్పులకు రంగం సిద్ధం చేసింది. బుధవారం ఢిల్లీలో ఆర్‌ఈసీ, పీఎ్‌ఫసీ, రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టులకు మొత్తం రూ.13 వేల కోట్ల అప్పులిచ్చేందుకు ఆ రెండు కార్పొరేషన్లు అంగీకారం తెలిపినట్లు సమాచారం. కాగా, ఇప్పటికే రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పూర్తిగా దివాళా తీసింది. జీఎ్‌సడీపీలో అప్పులు 3 శాతానికి మించకూడదనేది కేంద్రం చెబుతున్న సూత్రం. కానీ, ఇప్పుడు ఏకంగా 75 శాతానికి చేరడమంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఎప్పటికి పూర్తయ్యేనో?
భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క రామాయపట్నం పోర్టుకే రూ.10,009 కోట్లు అవసరమని అంచనా. దీనికి 3,634 ఎకరాల భూమి అవసరం కాగా, ప్రభుత్వం దగ్గర 550 ఎకరాలు కూడా లేదు. 2024 జనవరి నాటికి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇక మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. ఇక శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్టు నిర్మాణానికి భూసేకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. టెండర్ల ప్రక్రియ పూర్తయినా, ఇప్పట్లో పనులు ప్రారంభమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ పోర్టులకు అనుబంధంగా నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ల పరిస్థితీ ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. ఒక్కో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి రూ.500-600 కోట్లు ఖర్చవుతుందని అంచనా. జువ్వలదిన్నె, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనులు మాత్రమే తుది దశకు చేరుకున్నాయని చెబుతున్నారు. మిగిలిన 7 ఫిషింగ్ హార్బర్లు ఇంకా పూర్తి కావాల్సి ఉంది.