అమరావతి : వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి నేడు విచారణకు హాజరు కావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.160 కింద సీబీఐ నోటీస్ ఇచ్చింది. నిన్న తెలంగాణ హై కోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో తనను సీబీఐ విచారించకుండా స్టే ఇవ్వాలని అవినాష్ కోరారు. హైకోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ ఎదుట హాజయ్యేందుకు సమయం కోరే అవకాశం ఉంది. నేడు హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది.
6 అంశాలు ప్రస్తావిస్తూ అవినాష్ రెడ్డి పిటిషన్ వేశారు. జనవరి 28 ఫిబ్రవరి 24న ఆడియో, వీడియో రికార్డింగ్ లేకుండా చేసిన స్టేట్‌మెంట్ రికార్డును పరిగణలోకి తీసుకోవద్దని కోరారు. సీబీఐ జరిపే విచారణను మొత్తం ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని కోరారు. విచారణ సందర్భంగా న్యాయవాదిని అనుమతించాలని అవినాష్‌రెడ్డి కోరారు. జనవరి 28, ఫిబ్రవరి 24 తేదీలలో సీబీఐ రికార్డ్ చేసిన తన స్టేట్‌మెంట్స్‌ను ప్రొడ్యూస్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అర్థించారు. విచారణ సందర్భంగా ఎటువంటి తదుపరి చర్యలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వివేకా కేసులో సీబీఐ తనను విచారించే అంశంపై స్టే ఇవ్వాలని అర్థించారు. నేడు అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐ విచారణకు హాజరవుతారా? లేదా? అన్నది సస్పెన్స్‌గా మారింది.