దేశం గర్వించదగ్గ గొప్ప శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి, ‘మిస్సైల్ మ్యాన్’ భారత రత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మోమిన్ మహిల, గద్వాలలో ఆయన చిత్రపటానికి ఆవాజ్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికూర్ రెహమాన్, ముహమ్మద్ రహమతుల్లా మరియు ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి 2 నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా అతికూర్ రెహమాన్ మాట్లాడుతూ డాక్టర్ కలాం జీవితం ప్రతి విద్యార్థికీ ఆదర్శనీయమని ఆయన చూపిన బాటలో నడిచి క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. పాఠశాల ఉపాధ్యాయులు అరవింద్, స్వాతి మాట్లాడుతూ కలాం కలలు కనడమే కాకుండా, వాటిని సాకారం చేసుకోవడానికి అహర్నిశలు శ్రమించారని గుర్తుచేశారు.
స్వాతంత్ర సమరయోధుల నేమ్ స్టిక్కర్ల పంపిణీ.
మహమ్మద్ రహమతుల్లా మాట్లాడుతూ కలాం వర్ధంతిని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్, గుంటూరుకు చెందిన రచయిత సయ్యద్ నాసిర్ అహ్మద్ స్వాతంత్ర సమరయోధుల నేమ్ స్టిక్కర్లను రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షకు పైగా విద్యార్థులకు పంపిణీ చేయుటలో భాగంగా గద్వాల విద్యార్థులకు ఇవ్వాలని దేశభక్తిని పెంపొందించేందుకు ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణాలర్పించిన వీరులైన సిరాజు ద్దౌలా, టిప్పు సుల్తాన్, బహదూర్ షా జఫర్, హైదర్ అలీ వంటి మరెందరో మహనీయుల చిత్రాలు, వారి చరిత్రతో కూడిన నేమ్ స్టిక్కర్లను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ స్టిక్కర్లు విద్యార్థులకు నిత్యం దేశభక్తిని, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


