Wednesday, November 6, 2024
spot_img
HomeANDHRA PRADESHఅవినాశ్‌కు అరెస్టు భయం!

అవినాశ్‌కు అరెస్టు భయం!

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో శుక్రవారం సీబీఐ విచారణకు హాజరు కావాల్సిన ఎంపీ అవినాశ్‌ రెడ్డి… అంతకంటే ఒక్కరోజు ముందే హైకోర్టు మెట్లెక్కారు. ‘నన్ను అరెస్టు చేయకుండా చూడండి’ అని న్యాయస్థానాన్ని కోరారు. గురువారం దీనిపై తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ ముగిసేదాకా తనను 161 సీఆర్పీసీ కింద అసలు విచారించకుండా స్టే విధించాలని కోరారు.

హైదరాబాద్‌: వైసీపీ ఎంపీ అవినాశ్‌ రెడ్డి ఇప్పటికి రెండుసార్లు సీబీఐ ముందు హాజరయ్యారు. శుక్రవారం ఆయన మరోమారు విచారణకు హాజరవుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అవినాశ్‌ రెడ్డిని అరెస్టు భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే… ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లు భావిస్తున్నారు. ఈ పిటిషన్‌లో సీబీఐపై ఆయన అనేక ఆరోపణలు చేశారు. అంతేకాదు… వివేకా కుటుంబంలో చాలా వివాదాలున్నాయని, సొంత కుటుంబం నుంచే ఆయనకు ముప్పు ఉండిందని తెలిపారు. ‘‘నా వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో రికార్డు చేయాలని వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేసినా సీబీఐ అధికారులు పట్టించుకోవడం లేదు. జనవరి 28న, ఫిబ్రవరి 24న రెండు దఫాలు సీబీఐ తనను విచారించింది. అన్ని వివరాలూ వెల్లడించినప్పటికీ.. ఇంకా ఇబ్బంది పెడుతోంది. నా స్టేట్‌మెంట్‌ను ఆడియో వీడియో రికార్డు చేయడంతోపాటు స్టేట్‌మెంట్‌ కాపీని ఇచ్చేలా ఆదేశాలు జారీచేయండి. విచారణకు నాతోపాటు న్యాయవాదిని సైతం అనుమతించేలా ఆదేశించండి’’ అని అవినాశ్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టును కోరారు. తన పిటిషన్‌పై విచారణ ముగిసేవరకు సీఆర్పీసీ సెక్షన్‌ 161 కింద సీబీఐ తనను విచారించకుండా స్టే విధించాలని.. అరెస్టు సహా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఆదేశాలు జారీచేయాలని కోరారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారి తన పట్ల దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని.. ప్రజల్లో తనకు చెడ్డపేరు వచ్చేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత దర్యాప్తు అధికారి ఆధ్వర్యంలో తదుపరి ఎగ్జామినేషన్‌ జరిగితే తాను పారదర్శక దర్యాప్తు హక్కును కోల్పోతానని.. తన హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని తెలిపారు.

శుక్రవారం (10వ తేదీ) మళ్లీ విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు ఇచ్చిందని.. ఈసారైనా స్టేట్‌మెంట్‌ ఆడియో, వీడియో రికార్డు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. గత రెండు సందర్భాల్లో సీబీఐ కోరిన వివరాలిచ్చానని తెలిపారు. తాను చెప్పిన వివరాలను దర్యాప్తు అధికారి రికార్డు చేయలేదన్నారు. తన (అవినాశ్‌రెడ్డి) పేరు చెప్పాలని దర్యాప్తు అధికారి ఒత్తిడి చేయడంతోపాటు చట్టవిరుద్ధంగా థర్డ్‌ డిగ్రీ ప్రయోగిస్తున్నారని ఇప్పటికే వరప్రసాద్‌, వైఎస్‌ అభిషేక్‌రెడ్డి మీడియా ఎదుట వాపోయిన విషయాన్ని గుర్తించాలన్నారు. తన ప్రతిష్ఠను దెబ్బకొట్టడానికి సీబీఐ అధికారులు మీడియాకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని.. కొల్లూరు గంగాధర్‌రెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి అనుమానాస్పదంగా చనిపోయారని.. సాక్షులకు ప్రమా దం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. గంగాధర్‌రెడ్డి గుండెపోటుతో చనిపోయారని.. శ్రీనివాసులురెడ్డి విషం తీసుకోవడం వల్ల చనిపోయినట్లు మెడికల్‌ రిపోర్టుల్లో తేలిందన్నారు. వివేకా కుమార్తె సునీతా, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇద్దరికీ టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ బీటెక్‌ రవితో సత్సంబంధాలు ఉన్నాయని.. వారితో సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాతే సునీత తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. హత్య జరిగిన ఏడాది వరకు ఆమె తన పేరును ఎక్కడా చెప్పలేదన్నారు.

..అందుకే కుటుంబంలో గొడవలు!

చనిపోయిన వివేకానందరెడ్డి 2010లో షేక్‌ షమీమ్‌ అనే మహిళను వివాహం చేసుకున్నారని.. వారికి 2015లో కుమారుడు పుట్టాడని అవినాశ్‌రెడ్డి తెలిపారు. అప్పటి నుంచి ఆయనకు, కుమార్తె సునీత, అల్లుడికి పొసగడం లేదని.. వారి మధ్య 2011 నుంచి సత్సంబంధాలు లేవన్నారు. షమీమ్‌కు పుట్టిన కుమారుడికి రూ. 2 కోట్లు డిపాజిట్‌ చేస్తానని వివేకా హామీ ఇచ్చారని.. అప్పటి నుంచి ఆయన్ను దూరంగా ఉంచి.. ఆయన భార్య, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారని పేర్కొన్నారు. పలు కంపెనీల్లో డైరెక్టర్‌గా ఉన్న వివేకా చెక్‌ పవర్‌ను సైతం రద్దు చేయించారని తెలిపారు. వారసత్వం షమీమ్‌ కుమారుడికి వెళ్లిపోతుందోనని వివేకాను పూర్తిగా దూరంపెట్టి ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. వివేకాకు తన కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం ఉందన్నారు.

రోస్టర్‌ లేదని విచారణకు నిరాకరణ..

అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన ఈ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌.. జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి అవినాశ్‌రెడ్డిని సాక్షిగా విచారణకు పిలిచి సీబీఐ దర్యాప్తు అధికారి వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్న సంచలన కేసుల్లో కోర్టులు ఎలా కలుగజేసుకుంటాయి’ అని వ్యాఖ్యానించారు. రోస్టర్‌ ప్రకారం ఈ పిటిషన్‌ను తాను విచారించలేనని.. రోస్టర్‌ ఉన్న ధర్మాసనం ఎదుట శుక్రవారం లిస్ట్‌ చేయాలని ఆదేశించారు. ఈ పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చే అవకాశముంది.

వివేకా హత్య కేసులో.. నేడు సీబీఐ ముందుకు అవినాశ్‌

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో అవినాశ్‌ తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని కూడా కడప సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌ్‌సలో 12వ తేదీన విచారణకు రావాలని నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. కాగా.. తండ్రీ కొడుకులిద్దరినీ ఈ నెల 6వ తేదీనే విచారణకు రావాలని సీబీఐ మొదట నోటీసులు ఇచ్చింది. ఆ రోజు తనకు ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని అవినాశ్‌రెడ్డి లేఖ రాయడంతో 10వ తేదీన హైదరాబాద్‌కు రావాలని ఆయన్ను, 12న కడప సెంట్రల్‌ జైలుకు రావాలని భాస్కర్‌రెడ్డిని సీబీఐ ఆదేశించింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments