హైదరాబాద్/అఫ్జల్‌గంజ్: డబ్బు కోసం వైట్నర్ మత్తులో ఉన్న ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు హత్య చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌లోని నాగపూర్‌కు చెందిన సలీమా (30) కుటుంబంతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చింది. కొంతకాలంగా బేగంబజార్, అజీజ్ ప్లాజా, ఉస్మానియా ఆస్పత్రి తదితర ప్రాంతాల్లో యాచిస్తూ వచ్చిన డబ్బుతో వైట్నర్ పీలుస్తోంది. మత్తులో రాత్రి సమయాల్లో అక్కడే నిర్మాణంలో ఉన్న ఓ గదిలో ఉంటోంది. రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో సలీమా వద్ద డబ్బు దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఆమె అడ్డుకోగా తలను నేలకేసి కొట్టి హత్య చేశారు. మరుసటి రోజు గది నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని బేగంబజార్ పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దుండగుల చిత్రాలు సీసీ కెమెరాల ఫుటేజీల్లో కనిపించాయని, త్వరలోనే పట్టుకుంటామని ఇన్‌స్పెక్టర్ శంకర్ తెలిపారు.