చాలామందిలో కనిపించని లక్షణాలు!
నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువే
‘పాజిటివ్’ నమూనాలు జీనోమ్ పరీక్షకు
వైరస్ అంత ఆందోళనకరం కాదుగానీ..నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి: వైద్యులు
హైదరాబాద్ సిటీ: మనమంతా మర్చిపోయిన కరోనా మళ్లీ పడగ విప్పుతోంది! రాజధాని నగరంలో నిశ్శబ్దంగా.. చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇది.. కొత్తగా వచ్చిన జేఎన్1 వేరియంట్ తాలూకూ సైలెంట్ వేవ్ అని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. కొవిడ్ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. సీఎ్‌సఐఆర్-సీసీఎంబీ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రీయల్ రిసెర్చ్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ), టిగ్స్ (టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ-బెంగళూరు) శాస్త్రజ్ఞులు జంటనగరాలకు సంబంధించిన మురుగునీటి నమూనాలను పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు. ఉపశమనం ఏమింటే.. వైరస్ సోకిన చాలామందిలో ఎలాంటి లక్షణాలూ కనిపించట్లేదు. కొందరిలో స్వల్పంగా జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. లక్షణాలు కనిపించినవారిలో కూడా అతికొద్దిమంది పరీక్షలు చేయించుకుంటుండడంతో.. కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. వాస్తవంగా మాత్రం జంటనగరాల్లో అత్యధికులకు జేఎన్-1 వేరియంట్ ఇప్పటికే సోకిందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు.
‘‘ఈ కొత్త వేరియంట్.. ఒమైక్రాన్‌కు దగ్గరి బంధువు. గతంలో కరోనా బారిన పడడం వల్ల, వ్యాక్సిన్ల వల్ల వచ్చిన రోగనిరోధక శక్తిని సైతం తప్పించుకోగలుగుతున్న ఆసక్తికర వేరియంట్ ఇది. ఇది చాలా నిశ్శబ్దంగా వ్యాపిస్తోంది. కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించట్లేదు. మరికొందరిలోనేమో.. అసలు గుర్తించలేనంత స్వల్పస్థాయిలో మాత్రమే లక్షణాలుంటున్నాయి. దీనివల్ల ఎలాంటి ఆందోళనకర అనారోగ్యం కలగట్లేదు’’ అని టిగ్స్ డైరెక్టర్, సీసీఎంబీ మాజీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. ఈ వేరియంట్ వల్ల ఆస్పత్రిపాలయ్యేవారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. తమ పరిశీలన కోసం హైదరాబాద్‌లోని 18 ప్రాంతాల్లో ఓపెన్ నాలాలు.. బెంగళూరులో 26 మురుగునీటి శుద్ధి కేంద్రాల నుంచి, విజయవాడ, పుణె తదితర నగరాల నుంచి కూడా నమూనాలు సేకరించామని.. వాటిలో వైరల్ లోడ్ పెరిగే ట్రెండ్ గత ఏడాది డిసెంబరు మొదటి నుంచీ కనిపిస్తోందని ఆయన వెల్లడించారు.
మురుగునీటి నమూనాలను తరచుగా పరిశీలించడం ద్వారా.. ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుపుతామని వివరించారు. వైరస్ సోకినా అత్యధికుల్లో ఎలాంటి లక్షణాలూ కనిపించట్లేదు కాబట్టి.. ఆస్పత్రిపాలైనవారి నమూనాలకు వైద్యాధికారులు తప్పనిసరిగా మాలిక్యులార్ టెస్టింగ్ చేయించాలని రాకేశ్ మిశ్రా అభిప్రాయపడ్డారు. ‘‘65 ఏళ్లు దాటినవారు.. ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు ఉన్నవారు.. మాస్కులను తప్పనిసరిగా ధరిండం, జనసమర్ద ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఉండడం, ఒకవేళ అలాంటి చోట్లకు వెళ్లాల్సి వస్తే ఎన్-95 మాస్కు ధరించడం, చేతుల పరిశుభ్రతను పాటించడం వంటి ముందుజాగ్రత్త చర్యలను పాటించాలి’’ అని సూచించారు. ఫ్లూ లక్షణాలు కనిపించినా కరోనా పరీక్ష చేయించుకోవాలన్నారు. ‘‘వైరస్ అంత ఆందోళనకరమైనది కాదు. కానీ, నిరంతరాయంగా దాన్ని పర్యవేక్షించడం మాత్రం తప్పనిసరి’’ అని రాకేశ్ మిశ్రా హెచ్చరించారు.
గాంధీ ఆస్పత్రిలో..
జేఎన్-1 వేరియంట్ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. గాంధీ మెడికల్ కాలేజీలోని ల్యాబొరేటరీలో దీనికి సంబంధించిన పరీక్షలు వేగంగా జరుపుతున్నారు. ఇప్పటికే ఈ ల్యాబ్‌కు పలు కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి 60కి పైగా నమూనాలు వచ్చినట్లు సమాచారం.