తిరువనంతపురం: కేరళ.. ప్రగతిశీల రాష్ట్రం. అక్షరాస్యతలో దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుండే ప్రాంతం. అలాంటి చోట బడి పిల్లలు మత్తు పదార్థాలకు బానిసయ్యారు. స్కూళ్లు, ట్యూషన్ సెంటర్లలో విచ్చలవిడిగా డ్రగ్స్ వినియోగం పెరిగింది. బాలికలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం, వాటి కోసం బాయ్ ఫ్రెండ్స్‌తో సెక్స్ చేయడం వంటి విషయాలు కలవర పెడుతున్నాయి. దీంతో కేరళ సర్కారు అప్రమత్తమైంది. యాంటీ డ్రగ్ ప్రచార కార్యక్రమాలను ఉధృతం చేయడంతో పాటు డ్రగ్ పెడ్లర్లపై ఉక్కుపాదం మోపుతోంది. కొన్ని నెలల క్రితం సెంట్రల్ కేరళ ప్రాంతానికి చెందిన ఓ పట్టణంలోని లాడ్జిలో పోలీసులు రైడ్ చేయగా..డ్రగ్స్ మత్తులో ఉన్న ఓ యువతి వారిపై బిగ్గరగా అరుస్తూ నానా హంగామా సృష్టించింది. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఒకప్పుడు ఆమె చదువులో చాలా చురుగ్గా ఉండేది. డ్రగ్స్ మాఫియా ఆమెను మత్తు పదార్థాల ఊబిలోకి దింపడమేకాకుండా, తమ వ్యాపార విస్తరణకు యువతిని డ్రగ్ పెడ్లర్‌గా ఉపయోగించుకున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. కేరళలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగుచూశాయి. మత్తు పదార్థాలకు బానిసైన 21 ఏళ్లలోపు వారిపై కేరళ పోలీసులు ఓ సర్వే చేయగా.. అందులో 40 శాతం 18 ఏళ్లలోపు పిల్లలే ఉన్నారు. ఇందులో బాలికల సంఖ్య ఎక్కువ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీరు డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకున్నాక.. సరఫరాదారులుగా మారుతున్నారు. ‘‘గతంలో మత్తు పదార్థాలకు బానిసైన కేసులు ఎక్కువగా కాలేజీల్లో నమోదయ్యేవి. ఇప్పుడు స్కూళ్లలోనూ గుర్తిస్తున్నాం.
బాలికలూ మాదక ద్రవ్యాలకు బానిసవుతున్నారు. మహిళా పెడ్లర్లు మొదట అమ్మాయిలతో స్నేహం చేసి వారిని డ్రగ్స్ కూపంలోకి లాగుతున్నారు. రోడ్ల పక్కన, పాఠశాలల సమీపంలో ఉండే చిన్న చిన్న తినుబండారాల దుకాణదారులు విద్యార్థులకు డ్రగ్స్ అమ్ముతున్నారు. చాలా సందర్భాల్లో అబ్బాయిలు వారి గర్ల్ ఫ్రెండ్స్‌ను ఈ ఊబిలోకి దింపుతున్నారు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు గట్టి నిఘా పెట్టి డ్రగ్స్ వాడకాన్ని అరికట్టాయి. దీంతో మాఫియా ట్యూషన్ కేంద్రాలపై దృష్టిసారించింది. ఈ మహమ్మారి నిర్మూలనకు పాఠశాలల దగ్గరల్లోని తినుబండారాల దుకాణాల్లో 18 వేల రైడ్లు చేసి 401 కేసులు నమోదు చేశాం. 462 మందిని అరెస్టు చేశాం. 20.97 కిలోల గంజాయి, 186.38 గ్రాముల ఎండీఎంఏ, 1,122 గ్రాముల హాషిశ్‌ను సీజ్ చేశాం’’అని ఏడీజీపీ, యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ నోడల్ ఆఫీసర్ అజిత్ కుమార్ తెలిపారు.
స్కూల్ డెస్క్‌లు, బ్యాగ్‌లలో డ్రగ్స్..
‘‘మత్తు పదార్థాలకు బానిసైన పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు మేం కొన్ని పాఠశాలలను సందర్శించినప్పుడు డెస్క్‌లు, బెంచ్‌లపై, బ్యాగ్‌లలో డ్రగ్స్ ప్యాకెట్లు కనిపించాయి. స్కూళ్లలో మాదక ద్రవ్యాల వినియోగం చాలా ఎక్కువైంది. మేం కౌన్సెలింగ్ ఇచ్చినపుడు.. డ్రగ్స్ తీసుకున్నామని పిల్లలు ఒప్పుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చా యో చెప్పలేదు. 13 ఏళ్లు, ఆపైబడిన బాలికలు మత్తు పదార్థాలకు బానిసవడంతో పాటు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. అమ్మాయిలకు డ్రగ్స్ అలవాటు చేస్తున్న బాయ్ ఫ్రెండ్స్ తర్వాత వారిపై లైంగిక దాడి చేస్తున్నారు. మాదక ద్రవ్యాల ఊబిలోకి దిగిన బాలికలు మత్తు పదార్థాల కోసం బాయ్ ఫ్రెండ్స్‌తో సెక్స్‌కు అంగీకరిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో సన్నిహితంగా ఉండాలి. వారు ఏం చేస్తున్నారో గమనించాలి. తరచూ పిల్లల స్కూల్ బ్యాగులను తనిఖీ చేయాలి’ అని బాలల సంరక్షణ కేంద్రాల కౌన్సెలర్లు పేర్కొన్నారు. కేరళ ఇప్పుడు పంజాబ్ తరహా పరిస్థితిని ఎదుర్కొంటోందని ఓ పోలీసు అధికారి తెలిపారు. పోలీసు, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యాంటీ డ్రగ్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రభుత్వం దీనిపై సమర్థంగా పోరాడుతోందన్నారు. అందుకే గతంలో ఎన్నడూలేనంతగా నార్కోటిక్ డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం కేసులు..అరెస్టయిన వారి సంఖ్య 5 రెట్లు పెరిగాయని తెలిపారు.