అమెరికాలో హల్‌చల్ చేస్తోన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఎంటర్‌టైన్‌మెంట్ టు నైట్ ప్రోగ్రామ్ హోస్ట్ యాష్ క్రాసన్‌కు ఆదివారం జరగబోయే ఆస్కార్ ఈవెంట్ నిమిత్తం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘నాటు నాటు’ పాట సాధించిన ఘనతతో పాటు దర్శకధీరుడు రాజమౌళి తో వర్క్ చేయటం తనకెలాంటి అనుభూతినిస్తుందో కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆస్కార్ ఈవెంట్‌లో పాల్గొనాలనుకునే సెలబ్రిటీల పేర్లను.. తనకెంతో ఇష్టమైన, ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఇద్దరు ఫిల్మ్ మేకర్స్ పేర్లను ఆయన తెలియజేశారు. ఈ ఇంటర్వ్యూలో చరణ్ మాట్లాడుతూ..
‘‘ ‘నాటు నాటు’ కేవలం మూవీలోని పాట మాత్రమే కాదు. ఇది అందరి పాట. ప్రజలందరూ మెచ్చిన పాట. భిన్న సంస్కృతులకు చెందిన వేర్వేరు వయసులకు చెందినవారు పాటలోని సాహిత్యం అర్థం కానప్పటికీ తమ పాటగా స్వీకరించారు. పాట బీట్ ఫుట్ ట్యాపింగ్‌గా అందరూ మెచ్చేలా ఉంది. జపాన్ నుంచి యు.ఎస్ వరకు ప్రతీ ఒక్కరూ పాటను ఇష్టపడ్డారు. దీన్నంతా మూడో వ్యక్తిగా నేను గమనిస్తూనే ఉన్నాను. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఇంత కంటే గొప్పగా ఏదీ కోరుకోను.
– ఉక్రెయిన్‌లోని ప్రెసిడెంట్స్ ప్యాలెస్ ముందు వారం రోజుల పాటు నాటు నాటు పాటను రిహార్సల్ చేశాం. అక్కడి ప్రెసిడెంట్ కూడా ఓ నటుడే. కాబట్టి ఆయన అక్కడ షూటింగ్ చేసుకుంటామనే మా అభ్యర్థనను మన్నించారు. పాట చిత్రీకరణలో 150 మంది డాన్సర్స్ సెట్‌లో పాల్గొన్నారు. ఇంకా 200 మంది యూనిట్ సభ్యులున్నారు. పాట చిత్రీకరణకు 17 రోజుల సమయం పట్టింది. డాన్స్ చేసే క్రమంలో చాలా రీటేక్స్ తీసుకున్నాం. నేనైతే నాలుగు కిలోల బరువు తగ్గిపోయాను. ఆ కష్టం గురించి ఇప్పుడాలోచించినా నా కాళ్లు వణుకుతాయి.