టాలీవుడ్ కౌబోయ్, తెలుగు తెర ‘అల్లూరి’, ‘దేవుడులాంటి మనిషి’.. సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ (79) మంగళవారం తెల్లవారు జామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి (తెల్లవారితే సోమవారం) కార్డియాక్ అరెస్ట్‌కు గురైన కృష్ణను.. కుటుంబ సభ్యులు హుటాహుటిన కాంటినెంటల్ హాస్పిటల్‌కి తరలించారు. అనంతరం ఆయనను ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్సను అందించిన వైద్యులు.. కృష్ణ పరిస్థితి సీరియస్‌గానే ఉందని తెలిపారు. వాళ్లు అలా చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే కృష్ణ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మంగళవారం ఉదయం 4 గంటలకు ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. వయో భారం వల్ల సమస్యలే తప్ప.. ఆయనకు ఆరోగ్యపరమైన ఇతర ఇబ్బందులేమీ లేవు. కానీ ఈ మధ్య కాలంలో వరుసగా.. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే ముగ్గురు కుటుంబ సభ్యులు విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు, ఆ తర్వాత మొదటి భార్య ఇందిరా దేవి మృతి, అదే సమయంలో తన ఆప్తమిత్రుడైన రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా తనని వీడి వెళ్లిపోవడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ పరిణామాలు కృష్ణను మానసికంగా కృంగదీయడంతో ఆ ప్రభావం ఆయన ఆరోగ్యంపై కూడా పడింది.
350కి పైగా చిత్రాలతో తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఘట్టమనేని కృష్ణ.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన బుర్రిపాలెం గ్రామంలో ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, నాగరత్నమ్మ దంపతులకు 31మే, 1943న తొలి సంతానంగా జన్మించారు. హనుమంతరావు, నిర్మాత ఆదిశేషగిరిరావులు కృష్ణ సోదరులు. కృష్ణ-ఇందిరాదేవి దంపతులకు 5 గురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. పెద్దకొడుకు రమేష్ బాబు తొలుత నటుడిగా కెరీర్ ప్రారంభించి, అనంతరం నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. రెండో కొడుకు మహేష్ బాబు టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. పెద్ద కుమార్తె పద్మావతి అమరరాజా బ్యాటరీస్ ఎండీ, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ భార్య. రెండో కుమార్తె మంజుల దర్శకనిర్మాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. మూడో కుమార్తె ప్రియదర్శని హీరో సుధీర్ బాబు భార్య.
కృష్ణ తొలి చిత్రం అనగానే అందరికీ తేనెమనసులు (1965) చిత్రం గుర్తొస్తుంది. అయితే అంతకుముందే ఆయన కులగోత్రాలు (1961), పదండి ముందుకు (1962), పరువు ప్రతిష్ట (1963) చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించారు. ఆ తర్వాత తేనెమనసులు (1965) చిత్రంతో పూర్తి స్థాయిలో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేస్తూ తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్‌మన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం (సింహాసనం), మొట్టమొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు). ఇలా ప్రతీది కృష్ణ పేరిటే ఉన్నాయంటే తెలుగు సినిమా చరిత్రలో ఆయన స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు. కొత్త దర్శకులని, కొత్త నిర్మాతలని ఎందరినో ఆయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నిర్మాతగానూ పలు సినిమాలను కృష్ణ నిర్మించారు. సినిమాలే కాకుండా కృష్ణ రాజకీయాలలోనూ కొన్నాళ్ల పాటు కీలక పాత్ర పోషించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే కృష్ణ మనస్తత్వానికి రాజకీయ వాతావరణం అంతగా సరిపడకపోవడం, రాజకీయాలలో తనని ప్రోత్సహించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తదితర పరిణామాల మధ్య రాజకీయాలకు ఆయన స్వస్తి చెప్పారు.
సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలిసిన సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నారు.