ప్రస్తుతం దేశంలో ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని వాటిని రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారి రవికుమార్ పునరుద్ఘాటించారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ కార్యాలయంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర అధ్యక్షతన నిర్వహించిన ప్రబీర్ పుర్కాయస్థ ఆంగ్లంలో రాసి బోడపట్ల రవీందర్ చే తెలుగులోకి అనువాదం చేయబడ్డ అలుపెరుగని పోరాటం పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రబీర్ పుర్కాయస్థ జర్నలిజం ద్వారా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపగా ఆయనను ఉపా కేసు పెట్టి అరెస్టు చేయడం దారుణం అన్నారు. దేశంలో గత పది సంవత్సరాల్లో ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ సాయిబాబా అరెస్టు, ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకుడు స్టాన్ స్వామి అరెస్టు ఈ కోవ కిందికి వస్తాయన్నారు. మీడియాపై కూడా పాలకులు దాడి చేయడం దారుణమని దీనికి నిదర్శనమే ప్రపంచంలో గొప్ప ఛానల్ బిబిసి గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ విడుదల చేయగా ఈడి అధికారులతో బెదిరింపులకు పాల్పడి ఛానల్ మూసివేతకు కారణం కావడం భారత్ పాలకుల గొప్పతనం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్డిటీవీ, ద హిందూ లాంటి పత్రికలు కూడా పాలకుల దాడికి గురయ్యాయని ఇందిరాగాంధీ సమయంలో ప్రకటిత ఎమర్జెన్సీ విధిస్తే ప్రస్తుతం దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుందన్నారు. మూడోసారి మోడీ వస్తే రాజ్యాంగం కూడా కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని యువత ఇటువంటి వాటిని ప్రశ్నించే గొంతుకలుగా తయారు కావాలన్నారు.
ప్రపంచంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశాలు కూడా లౌకిక వాదాన్ని అనుసరిస్తున్నాయని, మతపరమైన రాజ్యం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందదన్నారు. పాలకులంటే భయపడకుండా వారిని నేరుగా ప్రశ్నించే ప్రబీర్ ను అరెస్టు చేసి మిగతా వారిని భయపెట్టే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తున్నాయని రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన స్వేచ్ఛ దేశంలో కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించేవారు ఉంటేనే ప్రభుత్వాల నుండి పేద ప్రజలకు ఫలాలు అందుతాయని కొమరం భీం జిల్లా పేరులోనే ఒక ప్రశ్నించే వీరుడి పేరు ఉందని బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురొడ్డి పోరాడిన గొప్ప వీరుడు భీమ్ అన్నారు. 70 పదుల వయసులో ప్రభుత్వానికి లొంగకుండా ప్రభీర్ జైలులో ఉన్నాడని, ఆయనకు మద్దతుగా బయట పోరాటం పోరాట గడ్డనుండే ప్రారంభం కావాలన్నారు. ఉపా చట్టం ప్రకారం కేసులు పెట్టడం కేంద్ర ప్రభుత్వం ఆపాలని డిమాండ్ చేశారు.
ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి ఆర్.మహేష్ “పాటనే నేనవుతా” అని పాడిన పాట ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టీకానంద్, కార్తీక్, టిఏజిఎస్ జిల్లా అధ్యక్షులు మాలశ్రీ, సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్, సిపిఎం జిల్లా కార్యదర్శి కూశాన రాజన్న, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నికోడే రవీందర్, అంబేద్కర్ సంఘ నాయకుడు అశోక్ మహల్కార్, బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మారుతి పటేల్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిప్ప సురేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు చాప్లే సాయిరాం, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, పంచాయతీ సెక్రటరీల సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణ, వ్య,కా, స జిల్లా కార్యదర్శి ముంజం ఆనంద్, పిఎన్ఎం జిల్లా కార్యదర్శి మహేష్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ క్రిస్టమచారి, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం నిఖిల్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పవన్ కుమార్ , పాత్రికేయ మిత్రులు కృష్ణపల్లి సురేష్, పాల్గొన్నారు