పాయకరావుపేట నియోజకవర్గంలో గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా హోం మంత్రి అనిత రోడ్ల అభివృద్ధి పనులు చేపడుతున్నారని అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల టిడిపి అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్ మీడియాతో అన్నారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులతో కలిసి మరమ్మత్తు పనులు నిమిత్తం ఉద్దండపురం నుండి తిరుపతి పాలెం రోడ్డు వరకు 14.5 లక్షల రూపాయల నిధులతో మంజూరైన అభివృద్ధి పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ గుంతల రహిత రోడ్ల నిర్మాణమే కూటమి ప్రభుత్వం లక్ష్యమన్నారు. వచ్చే సంక్రాంతి లోపు రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు నిర్మించడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. గత వైసిపి ప్రభుత్వంలో రాష్ట్రంలో రోడ్లు నరకానికి రహదారులుగా మారాయని, ఈ పరిస్థితికి గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి కారణమని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో వైసీపీ పూర్తి స్థాయిలో కనుమరుగైపోతుందని కూటమి ప్రభుత్వం మాత్రమే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్దండపురం కూటమి నాయకులు పొడగట్ల వెంకటరమణ, తుమ్మల వెంకటరమణ, తుమ్మల శ్యామ్ కిషోర్, అమలకంటి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.



