న్యూఢిల్లీ: ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తన ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్‌కు 700 మిలియన్ డాలర్ల సుమారు రూ.5790 కోట్లు ఉద్దీపన చెల్లించనున్నట్టు ప్రకటించింది. జీతంతో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తాన్ని చెల్లించే నిర్ణయం దాదాపు 25 వేల మంది ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు లబ్ది చేకూర్చనుందని అంచనాగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ ఈఎస్‌వోపీ (ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్స్) కలిగివున్న ఉద్యోగులందరికీ ఈ చెల్లింపు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఉద్దీపన చెల్లింపు ద్వారా ప్రస్తుతం ఉద్యోగులతోపాటు మాజీలు కూడా ప్రయోజనం పొందుతారని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ క్రిష్ణమూర్తి గతవారమే ప్రకటించారు. ఈ మేరకు ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపించారు. ఫ్లిప్‌కార్ట్ కొత్త షేర్ ప్రైస్ ఒక్కో ఆప్షన్‌కి 165.83 డాలర్లు ఉండగా.. ఆప్షన్‌కు 43.67 డాలర్లు చొప్పున ఉద్యోగులకు చెల్లించనున్నట్టు వివరించారు. 700 మిలియన్ డాలర్ల ఉద్దీపనలో సీనియర్ స్టాఫ్ సహా టాప్ 20 ఎంప్లాయీస్‌కే 200 మిలియన్ డాలర్ల మేర చెల్లించనున్నట్టు వెల్లడించారు. కాగా ఈ చెల్లింపు పొందనున్నవారి జాబితాలో ఫ్లిప్‌కార్ట్, మింత్రా, ఫోన్‌పేకు చెందిన ఉద్యోగులు ఉండనున్నారు.