రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పరిధిలోకి వచ్చే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఇచ్చే పింఛన్లను తగ్గించుకొనే దిశగా ప్రభుత్వం చేస్తున్న కసరత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పింఛన్లు రద్దు చేయడమే కాకుండా ప్రశ్నించేవారిని తిట్టాలని కలెక్టర్లకు హితోపదేశం చేస్తారా?’’ అని వ్యాఖ్యానించారు. పింఛన్ల తొలగింపు నిమిత్తం నోటీసులు జారీ చేస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ తొలగింపు ప్రక్రియను తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పవన్ కల్యాణ్ సీఎం జగన్‌కు లేఖ రాశారు. మీ పింఛన్లు ఎందుకు తొలగించకూడదో చెప్పాలని సుమారు 4 లక్షల మంది లబ్ధిదారులకు నోటీసులు జారీ చేశారని, పేదలైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను పింఛన్లకు దూరం చేయడమే లక్ష్యంగా నోటీసులు ఇచ్చారని అర్థం చేసుకోవాల్సి వస్తుందన్నారు.
లబ్ధిదారులను తొలగించేందుకు చూపించిన కారణాలు కూడా సహేతుకంగా లేవన్నారు. ‘‘శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్క పింఛన్ దారుడి పేరునా వేల ఎకరాల భూములన్నాయని కారణం చూపారు. అదే నిజమైతే ఆ వృద్ధులకు పట్టాదారుపాస్ పుస్తకాలు ఇప్పించండి. పెనుకొండలో రజక వృత్తిపై ఆధారపడిన పింఛన్‌దారుకి 158 ఇళ్లు ఉన్నాయని నోటీసుల్లో చూపారు. నిజంగా అన్ని ఇళ్లు ఉంటే అవి ఎక్కడ ఉన్నాయో చూపించి ఆ ఇళ్ల తాళాలు ఇవ్వండి. మీ ప్రభుత్వ రికార్డుల ప్రకారం వారంతా ఆస్తిపరులే అయితే పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ, మీ వలంటీర్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? పింఛన్ల రద్దు నోటీసులపై వాస్తవ పరిస్థితులను తెలియచేస్తుంటే సరిదిద్దకపోగా ‘తిట్టండి’ అని జిల్లా కలెక్టర్లను ఆదేశించడం ద్వారా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారనే భావిస్తున్నారా?’’ అని జనసేనాని తన లేఖలో ప్రశ్నించారు.