చెన్నై: ఆన్‌లైన్ రమ్మీని నిషేధించాలంటూ శాసనభలో మూడోసారి బిల్లును ఆమోదించి పంపితే గవర్నర్ ఆర్‌ఎన్ రవి తప్పనిసరిగా సంతకం చేయాల్సిందేనని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి రఘుపతి వ్యాఖ్యానించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆన్‌లైన్ రమ్మీ నిషేధానికి సంబంధించి న్యాయస్థానాలు గతంలో వెలువరించిన తీర్పుల సారాంశాన్ని బట్టి అసెంబ్లీలో బిల్లును ప్రతిపాదించామని, ఆ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా రెండుసార్లు తిప్పిపంపారని చెప్పారు. మొదటిసారి బిల్లును పంపినప్పుడు కొన్ని అంశాలపై వివరణ కోరారని, ప్రభుత్వం అన్ని వివరాలను పంపినా బిల్లును తిరస్కరించారని చెప్పారు. రెండోసారి అసెంబ్లీ ఆమోదించిన బిల్లును నాలుగునెలలకు పైగా పెండింగ్‌లో ఉంచి గవర్నర్ ఆర్‌ఎన్ రవి తిరస్కరించడం గర్హనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం గవర్నర్ తిప్పిపంపిన బిల్లును మళ్ళీ శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఆయన సంతకం పెట్టితీరాల్సిందేనని మంత్రి రఘుపతి స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో ఆన్‌లైన్ రమ్మీ నిషేధచట్టం బిల్లును గవర్నర్ తిరస్కరించిన అంశంపై కూడా చర్చిస్తామని వివరించారు.