Monday, May 20, 2024
spot_img
HomeTELANGANA కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలనూ విచారించాలి

 కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలనూ విచారించాలి

2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిచి.. బీఆర్‌ఎ్‌సలో చేరిన 12 మంది ఎమ్మెల్యేలపైనా విచారణ చేపట్టాలని సీబీఐని కోరనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వీరిలో కొందరికి పదవులు రాగా.. మరి కొందరికి ఆర్థికంగా లబ్ధి చేకూరిందన్నారు. ఇది కూడా ప్రలోభం కిందకే వస్తుందన్నారు. పార్టీ మారినందుకు ఈ 12 మంది ఎమ్మెల్యేలకు ఏం లబ్ధి చేకూరిందన్న వివరాలనూ సీబీఐకి అందజేస్తామని వెల్లడించారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ రేవంత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘సహజంగా కేసు విచారణ ఒకరు దోషి, ఒకరు బాధితునిగా జరుగుతుంది. నేరం జరిగింది.. తామే విచారిస్తామంటూ బీఆర్‌ఎస్‌ వాదిస్తుంటే, నేరమే జరగలేదంటూ బీజేపీ చెబుతోంది. నేరం జరగనప్పుడు సీబీఐ విచారణ ఎందుకు అడుగుతున్నరు? అంటే సీబీఐ అయితే బీజేపీ, సిట్‌ అయితే బీఆర్‌ఎస్‌ చెప్పినట్టు వింటాయనే స్పష్టత ఇచ్చారు కదా. ఇద్దరూ కలిసి ప్రజల్ని వెర్రివాళ్లను చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇంప్లీడ్‌ అయ్యే అంశంపైన పార్టీలో చర్చిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి గుండెతలుపునూ తట్టండి

ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని, రాష్ట్రాన్ని రక్షించేందుకు జనవరి 26 నుంచి నిర్వహించనున్న హాత్‌సే హాత్‌ జోడో కార్యక్రమంలో కార్యకర్తలందరూ భాగస్వాములు కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి గుండె తలుపునూ తట్టి బీజేపీ, బీఆర్‌ఎ్‌సలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వివరించాలన్నారు. వ్యక్తిగత అంశాలపై చర్చ పెట్టకుండా ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ చేతిలో తెలంగాణ బందీ అయిందని, రాష్ట్రాన్ని దోచుకోవడం అయిపోయిందని, బీఆర్‌ఎస్‌ పేరుతో జాతీయ స్థాయిలో దోపిడీకి సిద్ధమయ్యారని ఆరోపించారు. పార్టీ ఆఫీసు కోసం మూడు రోజులపాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్‌.. విభజన హామీలపైన కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు జరుగుతున్నా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రధాని మోదీ ఉన్నారని విమర్శించారు. దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడేందుకే రాహుల్‌గాంధీ పాదయాత్ర చేపట్టారని, భారత్‌ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించగానే మోదీ పీఠం కదిలిందని, అందుకే కోవిడ్‌ పేరుతో జోడో యాత్రను ఆపే కుట్ర చేశారని రేవంత్‌ ఆరోపించారు. కార్యక్రమంలో రేవంత్‌తో పాటుగా పార్టీ నేతలు మహే్‌షకుమార్‌గౌడ్‌, అంజన్‌కుమార్‌, పొన్నాల లక్ష్మయ్య, పొన్నం ప్రభాకర్‌, హర్కార వేణుగోపాల్‌, సంగిశెట్టి జగదీశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీలకు నిధులివ్వండి

పంచాయతీలకు కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులను వెంటనే వాటికి తిరిగి అందించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ద్వారా ఇచ్చిన రూ.35వేల కోట్ల మేరకు నిధులను రాష్ట్రప్రభుత్వం వేరే అకౌంటుకు బదిలీ చేసిందని, వెంటనే వాటిని పంచాయతీలకు తిరిగి ఇవ్వాలన్నారు. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ఇచ్చే నిధులను, గ్రామాల్లో సర్పంచ్‌లు చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులనూ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జనవరి 2న టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని రేవంత్‌ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments