తెలంగాణ కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వ సెక్యులర్ మంత్రివర్గంలో ముస్లింలకు మొండిచేయి చూపిందని ఆవేదన వ్యక్తపరిచారు పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ షేక్ అబ్దుల్ రహిమాన్.
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు సన్నాహకంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల్లో మూడింటిని ఆదివారం హడావిడిగా భర్తీ చేసింది. శనివారం రాత్రి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా తెల్లారి పదవుల పంపిణీ చేసింది. దీంతో మొత్తం రాష్ట్ర మంత్రుల సంఖ్య 15కి పెరిగింది.
ఈ సందర్భముగా పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ షేక్ అబ్దుల్ రహిమాన్ మీడియాతో మాట్లాడుతూ ఈ మంత్రివర్గ కూర్పుతో రెడ్లతో సమానంగ నలుగురు దళితులకు స్థానం దక్కినట్టయ్యిందని సామాజిక న్యాయం సాధన దిశలో ఇది ముందడుగని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని కానీ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల బీసీలకు మాత్రం మూడు పదవులు మాత్రమే ఇచ్చి సరిపెట్టారన్నారు. .
‘సామాజిక న్యాయం’ నినాదం నుంచి అమలు దిశలో తొలి అడుగు మాత్రమే పడిందని ఇప్పటికీ మెజారిటీ మంత్రి పదవులు అగ్రకులాల వారి చేతుల్లోనే ఉన్నాయని ఆధిపత్య కులాల్లో బ్రాహ్మణ, కమ్మ, వెలమ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు, రెడ్ల నుంచి నలుగురు మొత్తం 15 మందిలో ఏడుగురు ఆధిపత్య కులాల నుంచి మంత్రులున్నారని అదే బీసీలందరినీ ఒకే గాటన కట్టి మూడింటితో కథ ముగించారన్నారు. ముదిరాజ్‌లు, మున్నూరు కాపులు, గౌడ్‌లు, యాదవులు, పద్మశాలీలు జనాభా రీత్యా అత్యధికంగా ఉంటారని ఆధిపత్య కులం వారికి పదవులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వారిని సామాజిక వర్గాల వారిగా లెక్కగడుతారు. అదే బీసీల విషయంలో సామాజిక వర్గాలుగా (కులాల) కాకుండా గంపగుత్తగా బీసీలుగా లెక్కిస్తారని అట్లా బీసీలుగా లెక్కగట్టినా తాము హామీ పడ్డ 42 శాతం రిజర్వేషన్లు ఈ పదవుల్లో మాత్రం అమలు చేయడం లేదని అంటూ కాంగ్రెస్ పార్టీ తమ మూలసూత్రాల్లో ఒకటైన ‘సెక్యులర్’ భావనకు తిలోదకాలిచ్చిందని విమర్శించారు.
ఇక ముస్లింల విషయానికి వస్తే చెప్పుకోటానికి చరిత్ర తప్ప ఏమి మిగలలేదన్నారు 1952 నుంచి 1956 వరకు మనుగడలో ఉన్న హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో బూర్గుల రామకృష్ణారావు మంత్రివర్గంలో మాసూమా బేగమ్, మెహదీ నవాజ్ జంగ్‌లు మంత్రులుగా ఉన్నారని ఆ ఎన్నికల్లో హైదరాబాద్‌తో పాటు జనగామ, నిజామాబాద్‌లలో కూడా ముస్లింలు గెలుపొందారని పోలీస్ చర్య తర్వాత ముస్లింలపై తీవ్రమైన వివక్ష కొనసాగిన సమయంలో వీళ్లు విజేతలుగా నిలిచి మంత్రులుగా పనిచేశారన్నారు.
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, 2014 నుంచి తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నడూ ముస్లిం మంత్రి లేకుండా కేబినెట్ కూర్పు జరగలేదని అట్లాంటిది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గత ఏడాదిన్నరగా ముస్లిం మంత్రి లేకుండా నడుస్తుందని ఆవేదన వ్యక్తపరిచారు. విస్తరణలో స్థానం దక్కుతుందని ముస్లిం సమాజం ఆశించిందని ‘సెక్యులర్’ మంత్ర జపం చేస్తున్న కాంగ్రెస్ ఈ విస్తరణలోనూ ముస్లింలకు మొండి ‘చెయ్యి’ చూపించిందన్నారు.
కేంద్రంలో బిజెపి ఎట్లాగూ ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వలేదు. తెలంగాణ కూడా అదే బాటలో నడుస్తూ ముస్లింలను దూరం పెట్టిందనే విమర్శకు ఈ చర్య ఊతమిస్తున్నదని అందుకే ముస్లిం ఇంటలెక్చువల్స్ ఇప్పుడు కాంగ్రెస్, బిజెపి దొందూ దొందే అని భావిస్తున్నారని ముస్లింలకు మంత్రిపదవి నిరాకరించడంతో కాంగ్రెస్ ఫిత్‌రత్ ఏంటో ఉద్యమకారులకు, ముస్లిం ప్రజలకు అర్థమవుతున్నదని దుయ్యబట్టారు.
ఎవరైన సహచర ఎమ్మెల్యే చనిపోతే ఏ రాష్ట్రమైనా మూడ్రోజులు సంతాపదినాలు ప్రకటించి అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకుంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోతే అట్లాంటి సంతాప దినాలేవి ప్రకటించలేదు. అంత్యక్రియలు మాత్రం అధికారికంగా నిర్వహించారు. ఇది నైతికతకు సంబంధించిన అంశం. మంత్రి వర్గ విస్తరణను మూడ్రోజులు వాయిదా వేసుకున్నట్లయితే కొంపలేమి మునిగేవి కావు. మనిషి బతికున్నప్పుడు గాకున్నా చనిపోయిన తర్వాతైనా గౌరవం ఇవ్వడం బాధ్యత. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి కొట్లాటకు మళ్లీ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి అది వారికి ఇచ్చే ఆఖరు గౌరవం ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారు తప్పుజేసిందని యావత్ తెలంగాణ సమాజం భావిస్తుందని ఈ భవన్ వ్యతిరేకతగా మారితే దాని ప్రభావం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు మూల్యం చెల్లించుకునేలా చేస్తుందన్నారు పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్, తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ షేక్ అబ్దుల్ రహిమాన్.


