బీసీల కోసం గతంలో అమలు చేసిన అనేక పథకాలను పక్కనపెట్టి అందరికీ వర్తించే పథకాల లబ్ధినే బీసీ లెక్కల్లో ‘ప్రత్యేకం’గా చూపించి పదుగురికి పదవులకోసం తప్ప సామాన్య బీసీలకు ఉపయోగపడని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే గొప్పగా చెప్పుకొంటూ పార్టీ పదవుల్లోనూ బీసీలకు ‘పీట’ వేసినట్లే వేసి, పక్కనే మరో సొంత సామాజిక వర్గ నాయకుడికి ‘పెద్దపీట’ వేసిన అధికార పార్టీకి బీసీల ఓట్లు గుర్తుకొచ్చాయి. అందుకే అప్పుడెప్పుడో ఆమోదించి వదిలేసిన బీసీ డిక్లరేషన్‌కు ఇప్పుడు బూజు దులుపుతున్నారు.
2019 ఫిబ్రవరి 17వ తేదీ… ఏలూరులో విపక్షనేత హోదాలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీ తరఫున ‘బీసీ డిక్లరేషన్’ ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఐదేళ్లలో బీసీ సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చారు. మూడున్నరేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే… బీసీ డిక్లరేషన్‌ను ఎంతవరకు అమలు చేశాం? అచ్చంగా బీసీలకు మనం చేసిన మేలు ఎంత, ఏమిటి? కులాల వారీగా ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల ద్వారా ఎంతమందికి లబ్ధి జరిగింది? అనే ప్రశ్నలకు అధికార పార్టీ పెద్దలు సమాధానాలు వెతుక్కుంటున్నారు. బీసీలకు ప్రత్యేకంగా చేసిందేమిటో చెప్పలేక తడబడుతున్నారు.
తేడా కనపడి దడ…
ప్రభుత్వం గురించి వెనుకబడినవర్గాల ప్రజలు ఏమనుకుంటున్నారో నిఘావర్గాలు, సొంత సర్వేల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గత ఎన్నికలనాటి పరిస్థితికీ, ఇప్పటికీ మధ్య భారీగా తేడా ఉందని తేలుతుండటంతో అప్రమత్తమయ్యారు.
మళ్లీ బీసీ మంత్రం జపిస్తూ… బీసీ డిక్లరేషన్‌ను తెరపైకి తెస్తున్నారు. దీనిపై సమీక్షకు ఎంపిక చేసిన కొందరు బీసీ మంత్రులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారంటూ శుక్రవారం విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ.. శనివారం జగన్ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్యాలనాయుడు, జోగి రమేశ్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, మార్గాని భరత్, వైసీపీ బీసీ విభాగం చైర్మన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సమావేశమయ్యారు. విపక్షంలో ఉండగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై చర్చించారు.
సర్పంచ్ నుంచి మంత్రుల వరకూ బీసీ ప్రజా ప్రతినిధులు, నామినేటెడ్, పార్టీ పదవులు దక్కించుకున్న బీసీలతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో డిసెంబరు 8వ తేదీన పదివేల మందితో ఈ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 8వ తేదీన జరిగే బీసీల ఆత్మీయ సభకు ముఖ్యమంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని చెప్పారు.
బీసీలకు చేసిందేమిటో…
139 బీసీ కులాల్లో 56 కులాల కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన జగన్ సర్కారు..వాటి వల్ల జరిగిన మేలేమిటో చెప్పలేకపోతోంది. బీసీ కులాల కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. జగన్ సర్కారు బటన్ నొక్కి అందరికీ ఇస్తున్న పథకాలనే విడదీసి.. బలహీన వర్గాలకు మూడున్నరేళ్లలో 88 వేల కోట్ల రూపాయల లబ్ధి అందజేశామని లెక్కలు చెబుతోంది.మూడున్నరేళ్లలో ప్రభుత్వం ప్రత్యేకంగా తమ సంక్షేమానికి చేసింది శూన్యమని బీసీ వర్గాలు గ్రహించాయి. అందుకే.. వీరి ఓట్లకు గేలం వేసేందుకు బీసీ డిక్లరేషన్‌ను తెరపైకి తెచ్చి, ఆత్మీయ సమావేశం పేరిట హడావుడి చేస్తున్నట్లు భావిస్తున్నారు.