అమరావతి: కొందరు శాసనసభ్యుల తిరుగుబాట్లు, అసంతృప్తుల నేపథ్యంలో వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సోమవారం సమావేశం కానున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి చాలామంది ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తుండడం.. పాల్గొన్న కొందరు ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ అభివృద్ధి పనులపై నిలదీస్తుండడం.. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని తానే ఆదేశించినా మంత్రులు సహా ఎవరూ లెక్కచేయకపోవడంపై సీఎం ఆగ్రహంతో ఉన్నారు.
మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా కార్యకర్తలను గృహసారథులుగా నియమించేందుకు స్కెచ్ వేసింది. ప్రతి వలంటీర్‌కు ఇద్దరు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 5.20 లక్షల మంది గృహ సారథులు.. అదేవిధంగా ప్రతి గ్రామ/వార్డు సచివాలయంలో ముగ్గురు సమన్వయకర్తల చొప్పున 45,000 మందిని నియమించాలని సీఎం ఆదేశించారు. ఎమ్మెల్యేలు గడపగడపకు వెళ్లకపోయినా.. గ్రామ సారథులు, సమన్వయకర్తలు, వలంటీర్ల సహకారంతో జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఇంటింటికీ స్టిక్కర్ అతికించే కార్యక్రమంతో విస్తృతంగా ప్రచారం చేసుకోవడానికి కార్యాచరణ చేపట్టారు. మంగళవారం (ఈ నెల 14) నుంచి 19వ తేదీ వరకూ గృహ సారథులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు.
అయితే గృహసారథులు, సమన్వయకర్తల నియామకాలకు మెజారిటీ ప్రజాప్రతినిధులు పెద్దగా ఉత్సాహం చూపడం లేదు. చాలా చోట్ల నియామకం జరుగలేదు. గృహసారథులుగా చేరేందుకు యువతలో పెద్దగా స్పందన లేదని వైసీపీ వర్గాలే అంటున్నాయి. దీంతో.. గత ఏడాది డిసెంబరు 25 నాటికే పూర్తి కావలసిన గృహ సారథుల నియామక ప్రక్రియ వాయిదాలు పడుతూ వస్తోంది. అందుకే జగన్ నేరుగా నేరుగా రంగంలోకి దిగారని చెబుతున్నారు. వాస్తవానికి గడప గడపకు కార్యక్రమంపై వచ్చే నెల 17న సమీక్ష నిర్వహిస్తానని ఆయన ఇదివరకే ప్రకటించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యేల జాతకాలను ప్రకటిస్తానని కూడా చెప్పారు. ఇప్పుడు తాజా పరిస్థితి చూశాక సోమవారమే ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో భేటీ అవుతున్నారు.