కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రకాల సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సందర్భంగా ధరల పెరుగుదల వల్ల చితికిపోతున్నదెవరు? లాభపడుతున్నదెవరు? అనే ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. 2014 ఏప్రిల్- మే తర్వాత వినియోగదారుల ధరల సూచీ అంతకంతకూ పైకెగబాకుతోంది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం రేటు 7.8 శాతానికి చేరింది. దీన్ని కొలవడానికి వినియోగదారుల ధరల సూచీ (దీనినే జీవన వ్యయ సూచిక. అని కూడా అంటారు) యే ప్రామాణికం.. జీవన వ్యయం పెరిగినప్పుడు దీని వల్ల మొట్ట మొదట దెబ్బతినిపోయేది పేదలు, సామాన్యులే.
రైతులకేం ప్రయోజనం ?
ద్రవ్యోల్బణం సాధారణంగా ధాన్యాలు, కూరగాయలు , ఇతర ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదలలో ప్రతిబింబిస్తుంది. ఆహార ధరల సూచీ 17 నెలల గరిష్టానికి చేరుకుంది ధాన్యం ధరలు 21 నెలల గరిష్టానికి చేరుకున్నాయి. కూరగాయల ధరలూ పెరిగాయి.ఈ ఒక్క విషయాన్ని పరిశీలిస్తే చాలు ధరల పెంపు వల్ల ఎవరు ఎక్కువగా నష్టపోతున్నారో అర్థమవుతుంది.. పేదలు చేసే ఖర్చులో 60 శాతం ఆహారంపైనే ఉంటుంది.
ధనికుల ఖర్చులో ఆహారం 10-20 శాతం మాత్రమే. ఈ సాధారణ వాస్తవాన్ని ఆర్థిక శాఖ తలకిందులు చేసి చూపుతోంది. ధరల పెరుగుదల వల్ల రైతులకు ఎందుకు ప్రయోజనం కలగడం లేదు? దీనికి కారణం ఏడాదికేడాది కేంద్ర ప్రభుత్వం కొనుగోళ్లను తగ్గించేస్తున్నది. వ్యాపారులకు దోచిపెట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ పని చేస్తున్నది. దీంతో వ్యాపారులు రైతుల నుండి తక్కువ ధరకు ధాన్యాలు కొని ఎక్కువ ధరకు అమ్ముకోవడం లేదా ఎగుమతి చేయడమో చేస్తున్నారు..ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ప్రపంచంలో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారతదేశం నుండి ఎగుమతులను పెంచడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.అదే సమయంలో పంట పండించిన రైతుకు మాత్రం రవ్వంత ప్రయోజనం కూడా ఉండడం లేదు. గతంలో మాదిరిగా నిల్వలను పటిష్టం చేసి, ఆ నిల్వ ఉంచిన ధాన్యాన్నే వ్యాపారులకు అందుబాటులో ఉంచితే రైతులకు మేలు జరిగేది. కానీ దానికి బదులుగా వ్యాపారులు తక్కువ ధరలకు కొనుగోలు చేసి ఎగుమతి చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల ధరల పెరుగుదల వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది.
పెట్రో బాదుడు ?
ధరల పెరుగుదల గురించి కేంద్ర ఆర్థిక మంత్రి చర్చకు ముఖం చాటేస్తున్నారు.. డీజిల్‌పై 9 రెట్లు, పెట్రోల్‌పై 3 రెట్లు పన్ను పెంచి 8 ఏళ్లలో 26 లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన ఘనత మోడీ సర్కార్‌దే. ఈ మొత్తాన్ని భారతదేశంలోని కుటుంబాల సంఖ్యతో భాగిస్తే, మోడీ ప్రభుత్వం దేశంలో ఒక్కో కుటుంబం నుండి సగటున లక్ష రూపాయలను కొల్లగొట్టిందన్నమాట.
పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడానికే ఇదంతా వినియోగిస్తున్నట్టు అంకెల గారడీతో మభ్య పెట్టాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. పెట్రో ధరల పెంపుదల వల్ల ధనవంతులు, పేదలు ఇరువురిపైనా ప్రభావం పడిందని, అయితే దీనివల్ల పేదలకే అంతిమంగా ఎక్కువ ప్రయోజనం దక్కిందని కేంద్ర ఆర్థిక మంత్రి విచిత్రమైన వాదన చేస్తున్నారు.
ధరల పెరుగుదల అంత పెద్ద సమస్య కాదా ?
ప్రస్తుత ధరల పెరుగుదల అంత పెద్ద సమస్య కాదనే అంటున్నది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. అదే మంటే గతంలో కూడా ధరల పెరుగుదల సమస్య ఉంది కదా అని సమర్థించుకోజూస్తున్నది. గతంలో ధరల పెరుగుదలకు అప్పటి ప్రభుత్వాలు భారీ మూల్యమే చెల్లించుకున్నాయి. ప్రస్తుత ధరల పెరుగుదల గతంలో కంటే ప్రజల జీవన ప్రమాణాలపై ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఎందుకంటే కోవిడ్ కాలంలో చితికిపోయిన ఆర్థిక పరిస్థితి నుంచి సామాన్యులు ఇంకా కోలుకోలేదు. ప్రతి ఒక్కరూ తాము చేసిన అప్పుల నుంచి ఇప్పటికీ పూర్తిగా బయటపడలేదు. నిరుద్యోగం నాలుగు దశాబ్దాల్లోనే ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరింది.
పనిదినాలు గణనీయంగా పడిపోయాయి. ఎందుకంటే కోవిడ్‌కి ముందు ప్రభుత్వం ప్రకటించిన నోట్ల రద్దు సామాన్యుడిపై పిడుగుపాటులా పరిణమించింది. నోట్ల రద్దు వల్ల ఎక్కువ మందికి జీవనోపాధిగా ఉన్న అసంఘటిత రంగం దారుణంగా దెబ్బతినిపోయింది. దీనికి తోడు చుక్కలనంటుతున్న ధరలతో వేగలేక సామాన్యుడి బతుకు ఛిద్రమైంది.
టోకు ధరల సూచీ పైపైకి
ఏప్రిల్‌లో టోకు ధరల సూచీ 15.8 శాతం పెరిగింది. 30 ఏళ్లలో ఇదే అత్యధిక ద్రవ్యోల్బణం. టోకు ధరల సూచీకి, వినియోగదారు ధర సూచీకి మధ్య తేడా ఏమిటి? వినియోగదారు ధరల సూచీలో పరిగణించబడేది సగటు వ్యక్తి ఉపయోగించే వస్తువుల రిటైల్ ధరలు, ఆహారం , దుస్తులు , ప్రయాణం, విద్య , ఆరోగ్యం వంటి సేవలు.టోకు దరల సూచీ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి చేయబడిన అన్ని వస్తువులను పరిగణనలోకి తీసుకుంటుంది. పేరుకు తగ్గట్టుగానే ద్రవ్యోల్బణం టోకు ధర ఆధారంగా లెక్కించబడుతుంది.
వినియోగదారుల ధరల సూచీ వినియోగంపై దష్టి సారిస్తుంది. టోకు ధరల సూచీ ఉత్పత్తిలో ఉపయోగించే ముడి పదార్థాలపై దష్టి పెడుతుంది. సహజంగానే ఈ రెండు ధరల సూచీలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వినియోగదారుల ధరల సూచీ కన్నా టోకు ధరల సూచీ చాలా ఎక్కువగా ఉండడాన్ని నేడు మనం చూస్తున్నాం. భారతదేశంలో ఉత్పత్తి వ్యయం వేగంగా పెరుగుతోందని టోకు ధరల సూచి తెలియజేస్తోంది. ఉత్పత్తి ఖర్చుల పెరుగుదల వెంటనే ఉత్పత్తుల ధరలో ప్రతిబింబించకపోవచ్చు.మున్ముందు దీని ప్రభావం ఉంటుంది. ఇది ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తుందన్నమాట.
నొప్పి నుండి లాభం పొందుతున్నదెవరు ?
ధరల పెరుగుదల వల్ల ధనికులేమీ బాధపడరు. వారికి ఇది. లాభం కూడా. మొత్తం భారం శ్రామిక ప్రజలపైనే. వారి ఆదాయంలో కొంత భాగాన్ని ధనికులకు అనుకూలంగా పునఃపంపిణీ చేస్తారు. దావోస్‌లో బిలియనీర్ల సమావేశానికి ముందు, ఆక్స్‌ఫామ్ ‘నొప్పి నుండి లాభం పొందేవారు’ అనే పేరుతో ఒక నివేదికను ప్రచురించింది. కోవిడ్ సమయంలో తర్వాత ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్ పుడుతున్నారని, అదే సమయంలో ప్రతి 30 గంటలకు, ఒక మిలియన్ సాధారణ ప్రజలు అత్యంత పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఆ నివేదిక తెలిపింది. ఒక వైపు సంపద, ఇంకోవైపు పేదరికం ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు వంటివి. ఇది కోవిడ్‌కు ముందే నెలకొన్న ఆర్థిక మాంద్యం లోనూ, కోవిడ్ అనంతర అధిక ధరల కాలంలోనూ ధనవంతులు మరింత ధనవంతులు కావడం.. పేదలు మరింత పేదలు కావడాన్ని మనం చూస్తున్నాం.
Dr. M.I.KHURESHI
EDITOR-IN-CHIEF
INQUILAB TV