అధికారంలోకి వస్తే 6 నెలల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిపోయాయి. మరో ఏడాది మాత్రమే సమయం ఉంది. ఇంకెప్పుడు తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తారంటూ సీఎం జగన్‌ను కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఒడిసా ప్రభుత్వం అక్కడి కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు తెలంగాణ సర్కారు కూడా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిర్ణయించింది. రెండు పొరుగు రాష్ట్రాలు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తుంటే, ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ సర్కారు మాత్రం కమిటీల పేరుతో కాలయాపన చేయడం దారుణమని రాష్ట్రంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. మాట తప్పను.. మడమ తిప్పనంటూ మా సాయంతో గద్దెనెక్కిన జగనన్నా మీరెప్పుడు మాట నిలబెట్టుకుంటారు? అని కాంట్రాక్టు ఉద్యోగులు నిలదీస్తున్నారు.
రెగ్యులర్ చేస్తానని నాడు ఊదరగొట్టి..
2019 ఎన్నికలకు ముందు నిర్వహించిన పాదయాత్రలో అప్పటి ప్రతిపక్షనేత జగన్ పది మంది జనాలు గుమికూడిన ప్రతిచోటా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానంటూ ఊదరగొట్టారు. వివిధ శాఖల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానంటూ ఆశలు రేపారు. ఆ మాటలు నమ్మి ఉద్యోగులు ఆయనకు ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సీపీఎస్ మాదిరిగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల హామీని అట్టకెక్కించారని విమర్శిస్తున్నారు. మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పుకోడానికి మంత్రుల ఉప సంఘం ఏర్పాటు చేసి చేతులు దులుపుకొన్నారు. నమ్మించి నట్టేట ముంచిన జగన్ తీరుపై సుమారు3 లక్షల మంది వరకు ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రభుత్వం మంత్రుల కమిటీ వేసి మూడేళ్లయ్యింది.
మంత్రివర్గ ఉపసంఘం రెండుసార్లు సమావేశమై.. నివేదిక తయారు చేయాలని సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల వర్కింగ్ కమిటీని ఆదేశించింది. వర్కింగ్ కమిటీ మూడుసార్లు సమావేశమై డేటా సేకరించింది. ఒక్కో శాఖ ఒక్కో రకంగా సూచనలు చేసింది. రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగుల్లో 12,255 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులని ఆర్థికశాఖ అధికారులు నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో మంజూరైన పోస్టుల్లో రెగ్యులర్ ఖాళీలు 13,083, స్కీం ఖాళీలు 819, మంజూరు కాని పోస్టులు 4,356 కలిపి మొత్తం 18,258 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వర్కింగ్ కమిటీ అధికారులు నివేదించారు. అయితే, నియామకాల రూల్స్, వయోపరిమితిని పరిగణనలోకి తీసుకొని, ఉద్యోగ ప్రకటన ద్వారా నియామకాలు చేసుకున్న 12,255 మంది మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులవుతారని పేర్కొన్నారు.
ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి…
ఎన్నికల ముందు తమకు ఇచ్చిన హామీకి జగన్ కట్టుబడి ఉండాలని కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పక్క రాష్ట్రాలు హామీకి అనుగుణంగా రెగ్యులర్ చేస్తే.. ఇక్కడ మాత్రం మంత్రివర్గ ఉపసంఘం అని, ఎక్స్‌పర్ట్ కమిటీలు అని కాలయాపన చేయడం తగదని హితవు పలుకుతున్నారు.
కాలయాపన చేయకుండా క్రమబద్ధీకరించాలి
ఇచ్చిన మాట ప్రకారం కాలయాపన చేయకుండా కాంట్రాక్టు ఉద్యోగులందరినీ వెంటనే రెగ్యులర్ చేయాలి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. -సుమన్, ఏపీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్