మేళ్లచెర్వు, పాలకవీడు, డిసెంబరు 31: వచ్చే వానాకాలం సీజన్ నాటికి కృష్ణానదిపై పాత, కొత్త ఎత్తిపోతల పథకాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని ఎన్నెస్పీ సీఈ రమే్‌షబాబు అన్నారు. చింతలపాలెం మండల పరిధిలోని ఎత్తిపోతల పథకాలను ఆయన వరుసగా రెండోరోజు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భం గా సీఈ మాట్లాడుతూ, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాలను పరిశీలిస్తున్నామని, వాటిలో ఉత్తమ్‌పద్మావతి ఎత్తిపోతలను వినియోగంలోకి తీసుకువచ్చేందుకు రూ.7.4కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. నక్కగూడెం పథకం, పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి ముందుగా నిర్మించినందున బ్యాక్ వాటర్‌లో మునిగిపోయిందని, దాని పునర్నిర్మాణం కోసం రూ.41కోట్లు, బిట్టుతండా పథకానికి రూ.36.4కోట్లు, రెడ్లకుంట గ్రామంలో మున్నేరు వాగుపై నిర్మించే నూతన పథకానికి రూ.44.60 కోట్లు అవసరం అవుతాయన్నారు. వెల్లటూరులోని శివగంగ, గుల్లపల్లి ఎత్తిపోతల పథకాలు పాక్షికంగా నడుస్తున్నాయని, వాటికి తాత్కాలిక మరమ్మతులు నిర్వహించి ఈ సీజన్‌లో పూర్తిస్థాయి వినియోగంలోకి తెస్తామన్నారు. దొండపాడు వద్ద నూతన ఎత్తిపోతల పథకానికి సర్వే నిర్వహిస్తామని, దీని ద్వారా ఒకే లైన్లో రెండు పైప్ లైన్లు వేసి, రామాపురం ఎన్‌ఎస్పీ కాల్వలోకి ఒక కాల్వను. రామాపురంలోని గోపాలరావు చెరువుకు రెండోలైన్‌ను ఏర్పాటుచేస్తామన్నారు.
తమ్మారంలో నూతన లైన్ కోసం సర్వే నిర్వహించి మంత్రికి నివేదిక అందిస్తామన్నారు. ఎత్తిపోతల పథకాలపై రైతుల సలహాలు, సూచనలు స్వీకరిస్తామని, పెద్ద లైన్లు కాకుండా, చిన్న చిన్న లైన్లతో మంచి ఫలితాల వస్తాయని మంత్రి సూచించారని తెలిపారు. ఎత్తిపోతల పథకాల ఆపరేటర్లను ప్రభుత్వం కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తుందని, వీటి పైప్‌లైన్లను ఎవరైనా ధ్వసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఎన్నెస్పీ డీఈ స్వామి, ఏఈ శ్రీనివాసరావు, ఈఈ నర్సింహారావు, కొట్టే సైదేశ్వరరావు, ఇందిరారెడ్డి, నాగిరెడ్డి, జడ్పీటీసీ మాలోతు బుజ్జీ మోతీలాల్, మాలోతు హతిరాం, నగేష్, వినోద్, శ్రీను, రమణ, కిషన్, కృష్ణా నాయక్, తదితరులు పాల్గొన్నారు.