ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘అవతార్ : ది వే ఆఫ్ వాటర్’. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదల కానుంది. భారత్‌లో ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రీమియం ఫార్మాట్స్‌లో 45 స్క్రీన్స్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఒపెన్ చేయగా మూడు రోజుల్లోనే దాదాపుగా 15వేల టిక్కెట్స్ అమ్ముడు పోయాయి. ఈ మూవీపై భారీ క్రేజ్‌తో పాటు సినిమా విడుదలకు మూడు వారాల గడువు ఉండటంతో టిక్కెట్స్ మరిన్ని బుక్ అవుతాయని మేకర్స్ అంచనా వేస్తున్నారు.
జేమ్స్ కామెరూన్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తాయని పీవీఆర్ పిక్చర్స్ సీఈవో కమల్ జియా చందానీ అన్నాడు. ‘‘జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చే చిత్రాల కోసం ప్రేక్షకులు ఎదురు చేస్తుంటారు. ప్రీమియం ఫార్మాట్స్ అడ్వాన్స్ బుకింగ్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. సాధారణ బుకింగ్స్ కూడా ఒపెన్ అయితే ఈ టిక్కెట్స్ సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ బుకింగ్స్ నవంబర్ 26నుంచి ప్రారంభమవుతాయి’’ అని కమల్ చెప్పాడు. ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా కూడా మాట్లాడాడు. ‘‘అవతార్ సీక్వెల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ఐనాక్స్‌లోని అన్ని ప్రీమియం ఫార్మాట్స్ టిక్కెట్స్ ఇప్పటికే విక్రయమయ్యాయి’’ అని రాజేందర్ తెలిపాడు. సినీ పోలీస్ సీఈవో దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ.. ‘‘అవతార్ మొదటి పార్ట్ 13ఏళ్ల క్రితం విడుదలయినప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ అయింది. సినీ పోలీస్ రియల్ 3డీలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు’’ అని దేవాంగ్ పేర్కొన్నాడు.