Monday, October 7, 2024
spot_img
HomeCINEMA"సూపర్‌స్టార్"

“సూపర్‌స్టార్”

కోటగోడల్ని పగలగొట్టడం, ఆధిపత్యాల్ని కూలదోయడం, కొత్త దారుల్ని వేయడం, పదిమందీ నడవడానికి దారిని విశాలం చేయడం హీరోతనమైతే దానికి అర్హుడు కృష్ణనే. స్వయంగా వెలగడం “స్టార్” లక్షణమైతే, అలా వెలగడంలో సూపర్‌స్టార్ ఆయన. ఆంగికం, వాచకం, అభినయం అనే మూడు అంశాలు తెరమీద నాటకానికి కీలకమనే అభిప్రాయాన్ని తత్తునియలుచేసి అదీ ఎడమచేతి(వాటం)తో ప్రేక్షకులచేత నీరాజనాలందుకున్న నటుడు కృష్ణ. కృతకమైన నటనలు, వ్యక్తిత్వాలూ ఆయన ప్రదర్శించలేదు అందరి నటుల్లాగా. ఆయన సహజంగా మన ఇళ్లలో, ఇంటి పక్కల మనుషులు ఎలా వుంటారో, అతడు అలాగే వున్నాడు, ఎన్ని పాత్రలు వేసినా అందులో కృష్ణనే వున్నాడు! అందుకే అతడిని జనం మెచ్చారు.


కళామతల్లి అంటూ సినిమాకు పనికిమాలిన పెద్దరికాలు కట్టబెట్టలేదు, అలాగే తానూ ఆకాశం నుండి వూడిపడిన నటుడినని గొప్పలు పోలేదు. సినిమా అంటే జనాల్ని రంజింపజేసే అంశం, దాన్ని విస్తరించాలి, దానికి నాకున్న ప్రేమను ప్రదర్శించుకోవాలి, ఇదీ సింపుల్‌గా కృష్ణ సినిమా ప్రస్థానం.
నాగేశ్వర్రావు క్లాస్ అయితే, మిడిల్ క్లాస్ ఎన్‌టీయార్ అయితే, మాస్‌కి హీరో కృష్ణనే. అందుకే తెలుగునాట అత్యంత హార్డ్‌కోర్ అభిమానులు ఆయనకు సొంతం.
కృష్ణ కిందికులాల హీరో. మైనారిటీ మతాల హీరో, సెక్యులర్ పీపుల్ హీరో. ఎన్‌టీయార్ రాముడు, కృష్ణుడు పాత్రలతో ఒక పురాణ పురుషుడిగా, అభిజాత్యాలున్న హీరోగా తెరమీద విస్తరించినప్పుడు దళితులు, ముస్లింలు సహజంగానే కృష్ణని ఇష్టపడ్డారు. ఈ విషయాన్ని కృష్ణ సోదరుడు స్వయంగా అంగీకరించాడు.
కృష్ణ చేసిన గొప్ప పని ఏమంటే సినిమా రంగాన్ని విస్తరించాడు. అతడు దాదాపు సినిమాలోని ప్రతి రంగంలో ప్రయోగాలు చేశాడు. ఈ ప్రయోగాలు సినిమా రంగాన్ని విస్తరింపజేసి ఒక పరిశ్రమస్థాయికి తీసుకు రావడం ఆయనవల్లే జరిగిందనాలి. ఎందుకంటే మొదటి తెలుగు సినిమా తమిళ, మళయాల, హిందీ అంటూ తెలుగునాటనుండి, దక్షిణాదికే గాక, దేశాన్ని దాటి, అంతర్జాతీయ స్థాయికి అంటే ఇంగ్లిష్‌లో డబ్ చేసి విడుదలచేసింది కృష్ణ సినిమానే, అది మోసగాళ్లకు మోసగాడుకు డబ్బింగ్ “ట్రెజర్ హంట్”.


అతడు దాదాపు ప్రతి సినిమాలో ఒక కొత్తదనాన్ని పరిచయం చేయాలని ప్రయత్నించాడు. టెక్నికల్ విషయాలలో, సినిమా జానర్ విషయాల్లో ఆయన చేసిన ప్రయోగాలు అపూర్వం. మొదటి సినిమా స్కోప్ అతడిదే, మొదటి ఈస్టమన్ కలర్ అతడిదే, మొట్టమొదటి 70ఎంఎం అతడిదే, మొదటి డీటీఎస్ అతడిదే. మోసగాళ్లకు మోసగాడు వంటి కౌబాయ్ సినిమా తీసి భారతీయ సినిమాని నివ్వెరపరిచాడు. అయితే అతడీ ప్రయోగాలు ఇతరుల డబ్బుమీద చేయలేదు. తనే నిర్మాతగా చేశాడు, పద్మాలయా సంస్థ పేరుతో. అప్పట్లో ఎన్‌టీయార్ గానీ, నాగేశ్వర్రావ్ గానీ, ఇప్పటి నాగార్జున, చిరంజీవిగానీ సాహసించలేని సాహసాలన్నీ కృష్ణ చేయడం గమనార్హం. ఆయన మాత్రమే అల్లూరి సీతారామరాజు తీయగలిగాడు, సింహాసనం తీయగలిగాడు. ఆయన పక్కనుండి భార్య విజయనిర్మలను అతి ఎక్కువ సినిమాలు తీసిన దర్శకురాలిని చేయగలిగాడు. అసలు హీరోయిన్ లేని “ఈనాడు” వంటి సినిమా అప్పట్లోనే తీయగలిగాడు.


బాలసుబ్రమణ్యం పాడకపోతే, అతనింట్లో కోడికూయకపోతే ప్రపంచానికి తెల్లవారదనే అభిప్రాయాన్ని అప్పట్లో దేశంలోని అతిపెద్ద బడ్జెట్ చిత్రమైన సింహాసనంలో టీన్స్‌లో వున్న ఒక అనామక రాజ్‌సీతారాం అనే కుర్రాడిచేత పాడించి పటాపంచలు చేశాడు. బాలసుబ్రమణ్యం క్షమాపణలకోసం వస్తే ఒక్క మాట మాట్లాడకుండా “రేపటినుండి మనం కలిసి పనిచేస్తున్నాం” అనే ఒక్కమాట చెప్పి అతడిని వదిలేశాడు.


అతడు అన్ని సంప్రదాయాల్నీ, పద్దతుల్నీ బద్దలు చేశాడు. సెట్లో మొదటిసారి అతడు మాంసాహార వంటకాల్ని రుచిచూపించాడు. రోజుకు మూడు షిఫ్టుల్లో పనిచేయడమేకాదు, ఒకే సవత్సరం 18 సినిమాలు చేసి సినిమా పరిశ్రమని విస్తృతపరచడమే గాదు, సినిమా ఆధారిత బయటి ప్రపంచాన్నీ విస్తృత పరిచాడు. అతడి సినిమాకు నాలుగైదు కిలోమిటర్ల క్యూలైన్లు వుండేవి. అతని సినిమాలకోసం అంతకుముందున్న టాకీసుల్ని మార్చాల్సి వచ్చింది, కొత్త థియేటర్లు నిర్మించాల్సి వచ్చింది. నర్తకి, మంగ, అర్చన వంటి టాకీసులు అలా వచ్చినవే. వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయడం, జనాల్ని రంజింపజేయడం, పదిమందికి తిండి దొరికేలా చూడ్డం అనేవి ఆయన ఆలోచనలు, అంతే.


దేనికీ వెరవకపోవడం అయన నైజం. తాను సినిమా తీస్తున్నానని తెలిసీ నాగేశ్వరావ్ “దేవదాస్” రెండో సారి విడుదల చేశారు, కానీ కృష్ణ తీసిన దేవదాసే అద్భుతం అని పొగిడారు నాడు ఎల్వీ ప్రసాద్, చక్రపాణి లాంటివారు. అప్పటికే పౌరాణిక సినిమాలతో లబ్ద ప్రతిష్టుడైన ఎన్‌టీయార్ దానవీరశురకర్ణకు పోటీగా కురుక్షేత్రం విడుదల చేశాడు. అయన చేసినన్ని మల్టీస్టారర్ సినిమాలు ఎవరూ చేయలేదు. స్క్రిప్టుతో వచ్చిన నిర్మాతల్ని ముందు ఎదుటి హీరోకి వినిపించి అతడు కోరుకున్న రోల్ అతడికిచ్చి, మిగిలిన రోల్ తనకిమ్మని అడిగేంత సాహసం అతడిది.


అయనెప్పుడూ రికార్డులు చూడలేదు, ప్రచారం కోసం ఎన్నడు పాకులాడలేదు, తానేదో గొప్పని ఎన్నడూ విర్రవీగలేదు. కులం చట్రంలో తనను ఇముడ్చుకోలేదు. అతని సినిమాల గొప్పదనం గురించి ఎవరు మాట్లాడినా ఆ, ఏదో, అలా తీసేశాం అనేపదాలు వాడాడేగానీ గురించి వాక్యాలు వాడలేదు. నిజానికి 350 పై చిలుకు సినిమాలు, 100 పైగా దరకులతో, 50కిపైగా సంగీత దర్శకులతో, మల్టీస్టారర్లూ, త్రిపాత్రాభినయాలూ, ద్వీపాత్రాభినయాలూ, రకరకాల ప్రయోగాలు చేసి, ఒకేసంవత్సరం 19 సినిమాల్లో నటించి, సినిమాకు చెందిన అన్ని శాఖలు నిర్వహించిన అతడికి “దాదా సాహెబ్ ఫాల్కే” అవార్డు రాలేదు, పద్మభూషన్ కూడా రాలేదు. రాజకీయాల నేపధ్యంలో చిరంజీవికి పద్మభూషన్ ఇస్తే, రగిలిపోయిన అతడి అభిమానులు “ప్రజా పద్మభూషణ్” అనే బిరుదు కట్టబెట్టారు. రాయలసీమలోని ఒక సభలోని సభికుల సంఖ్యని బాగా తగ్గించి రాశాడని రామోజీరావు పత్రికను ప్రెస్‌మీట్ పెట్టి దుయ్యబడితే, అందుకు అలిగిన పత్రికా యాజమాన్యం తమ సినిమా పత్రిక సితారలో 15 సంవత్సరాల పాటు కృష్ణకు చెందిన ఏ సినిమా వార్తా ప్రచురించకపోయినా ఆయన కించిత్ వెరవలేదు. ఒకదశలో ఆయన తన సినిమాలని అవార్డులకోసం పంపడం మానేశాడు.


అంతెత్తు సినిమాలు తీసినా నేల మీదే నడిచాడు. దీనికి కారణం తన గురించి తానకు స్పష్టత వుండడం. తాను స్టార్ అయ్యాక తీస్తోన్న సినిమాలో దర్శకుడు బాపు ఎక్కువ టేక్స్ తీస్తున్నాడట ఓక షాట్ కోసం. పక్కనే కుర్చొన్న బాపు స్నేహితుడు రమనతో కృష్ణ అన్నాడట, “నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పటికీ, ఇప్పటికీ చాలా మారాననుకుంటున్నారేమో ఆయన, అదేం లేదని ఆయనకు చెప్పండి”! ఇదీ ఆయన బోళాతనం, నిజాయితీ. కృష్ణతో ఎవరు సినిమాలు తీసినా సౌకర్యంగా వుండగలిగారు. దానికి కారణం అయన క్షమ, మంచితనం, ముక్కుసూటితనం. తనతో సినిమాలు చేసిన నిర్మాతలు కనపడకపోతే పిలిపించేవాడట. డబ్బులేక ఖాలీగా వున్నామని చెబితే తనె కాస్టింగ్ కూర్చి సినిమా తీసిపెట్టి మళ్లీ తేరుకునేలా చేసేవాడు. తనకు అవకాశం కల్పించిన ఆదుర్తి బ్లాక్ అండ్ వైట్‌లో గాజుల కిట్టయ్య సినిమా తీస్తుండగా పిలిపించి, తనే హీరోగా నటిస్తానని చెప్పి, కలర్‌లో తీయడానికి సహాయం చేశాడు. అతడి కొడుకుని తన కొడుకులా చూసుకున్నాడు. అతడి వద్ద పనిచేసిన సిబ్బంది, ఆర్టిస్టులూ సంతోషంతో పనిచేశారు, అందుకే అద్భుతమైన సినిమా పాటలు కృష్ణకే వుంటాయి!


ఆయన కీర్తే కాదు, డబ్బూ పట్టించుకోలేదు. 40-50 సినిమాల దాకా అతడు రెమ్యునరేషన్ పెంచలేదు, నిర్మాతలు ఇవ్వబోతే నాకంత రేంజ్ వుందంటారా? అని ప్రశ్నించగలిగాడు అందుకే. అతనివద్ద నిర్మాతలిచ్చిన చెల్లని చెక్కులతో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయవచ్చనేది ఎవరో అన్నమాటకాదు, స్వయంగా ఆయనే అన్నాడు. ఆయన సినిమలౌ 48,49 రోజులకూ కూడా టాకీసులనుండి మొహమాటంలేకుండా ఎత్తేయమనేవాడు రికార్డులకోసం చూడకుండా. ప్రజా అవసరాలకోసం విరాళాలు ప్రకటించడం అతడె నేర్పాడు సినిమా రంగానికి.


ఒకరిని అనుకరించడం, తనకు తానే కృతగంగా నటించడం కృష్ణ చేయలేదు. ఆయన అన్నిపాత్రల్లో నటించాడు. రైతు పాత్రలకు పెట్టిందిపేరు. నిజానికి ఎన్‌టీయార్ రాజకీయ చైతన్యం పార్టీ పెట్టి తెచ్చాడు, కానీ దానికి భూమికను నిర్మించింది కృష్ణనే. ప్రజా చైతన్యం కోసం ఆయన తీసినన్ని రాజకీయ చిత్రాలు మొత్తం దేశంలో ఎవరూ తీయలేదు. అప్రతిహతంగా అధికారంలోకి వచ్చిన ఎన్‌టీయార్‌కి వ్యక్తిరేకంగా నిలబడి విమర్శనాత్మక రాజకీయ సినిమాలు తీశాడాయన అప్పట్లోనే.


కృష్ణ నటుడు, దర్శకుడు, నిర్మాత, ఎడిటర్, రాజకీయనాయకుడు, ఒక్కమాటలో చెప్పాలంటే హీరో. అవును, తెలుగు సినిమా చరిత్రలో ఎవరి పేరుముందూ లేని పదం అతని పేరుముందు చేర్చి వాడతారు, హీరో అని. ఎస్, ఆయన హీరో కృష్ణ. కృష్ణ కొడుకు ఒక సినిమాలో “ఎలాగోలా బ్రతికేయడానికి ఇక్కడికి రాలేదు..” అన్నట్లు నిజమే అతడు స్పష్టంగా ప్రకటించి మరీ వచ్చాడు సినిమా రంగానికి, నేను హీరోగానే నటిస్తానని చెప్పి. కృతకపు నటనలు, తరమీద వెనక సంప్రదాయాలూ, పద్దతులూ, విశ్వాసాలకు, ఆధిపత్యాలకు ఉచ్చపోయించాడు. కోట్లాది తెలుగు హృదయాల్ని ఏలేశాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments