బెంగళూరు: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు వస్తున్న తరుణంలోనే రాష్ట్రమంతటా పర్యటిస్తానని మాజీ ప్రధాని దేవెగౌడ తెలిపారు. స్వగ్రమం హరదనహళ్లిలో ఇంటిదేవుడు దేవేశ్వరుడికి ఆయన ప్రత్యేక పూజలు చేయించారు. సోమవారం హాసన్‌లో మీడియాతో మాట్లాడుతూ వచ్చేవారం నుంచి హాసన్ జిల్లా వ్యాప్తంగా తిరుగుతానని ప్రకటించారు. తర్వాత రాష్ట్రమంతటా పర్యటించేలా కార్యక్రమాలు సిద్ధం చేసుకుంటానని తెలిపారు. ఎవరు ఎన్ని విశ్లేషణలు చేసినా, ఎంతమంది జేడీఎస్‌ను విమర్శించినా పట్టించుకునేది లేదన్నారు. రాష్ట్రంలోని జేడీఎస్ కార్యకర్తలందరినీ కలుస్తానన్నారు. జిల్లాలవారీగా ప్రత్యేక సమావేశాలు జరుపనున్నట్లు చెప్పారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లోనూ పాల్గొంటానని తెలిపారు. రాష్ట్రంలో జేడీఎ్‌సను బలోపేతం చేసేందుకు శాయశక్తులా పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో నిర్మించిన భారీ కెంపేగౌడ విగ్రహ ఆవిష్కరణ సభకు ఆహ్వానించే విషయమై సాగుతున్న వివాదంపై మాట్లాడేది లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం కెంపేగౌడ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కాగా దేవెగౌడ వయోభారం ఆరోగ్య సమస్యలతో కొన్ని నెలల కాలంగా ఇంటికే పరిమితంగా గడిపారు. ఇటీవలే అప్పుడప్పుడు ప్రాధాన్యతా కార్యక్రమాలలో భాగస్వామ్యులవుతున్నారు.