తెలుగు, తమిళ భాష సినిమాల వివాదం రోజు రోజుకూ రాజుకుంటోంది. తమిళ నిర్మాతల మండలి సమావేశం అయి, విజయ్ నటించిన సినిమా ‘వారసుడు’ డబ్బింగ్ తెలుగు సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్స్ కేటాయించాలని తెలుగు నిర్మాతల మండలితో మాట్లాడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. అలాగే తెలుగు అగ్ర నిర్మాతలు ఇద్దరు, అల్లు అరవింద్, అశ్వనిదత్ లు తెలుగు నిర్మాతల మండలి ఇచ్చిన ప్రకటన, తెలుగు చిత్రాలకే ముందు ప్రాధాన్యత ఇవ్వాలన్నది వెనక్కి తీసుకోవాలని కోరినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. వీటన్నిటికీ తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ సమాధానం చెప్పారు.
దీనిలో వివాదం ఏమి లేదు, సంక్రాంతి మనకి పెద్ద పండగ, అందుకని తెలుగు సినిమాలకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం, అని ప్రసన్న అన్నారు. అయితే ఈ అగ్ర నిర్మాతలు ఇద్దరు మాట్లాడే విధానాన్ని తప్పు పట్టారు ప్రసన్న కుమార్. “వాళ్లిద్దరూ ఏమి చెపుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకి థియేటర్స్ ఇవ్వవద్దు అని చెపుతున్నట్టేగా. వాళ్ళు విజయ్ సినిమా ‘వారసుడు’ కి థియేటర్స్ ఇవ్వాలని అని అంటున్నారు అంటే మన తెలుగు అగ్ర నటులకి ఇవ్వొద్దని చెపుతున్నట్టేగా,” అని చెప్పారు ప్రసన్న కుమార్.
“ఇదే అశ్విన్ దత్ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అప్పుడు తమిళనాడు లో విడుదల చేస్తే, ప్లాప్ అయింది కదా. తమిళ ప్రేక్షకులు ఆ సినిమాని ఒక పెద్ద జోక్ కింద తీసేసి చూడలేదు. అలాగే అతను ఒకే ప్రొడ్యూసర్ కి చెందిన రెండు సినిమాలు ఎలా ఒకేరోజు విడుదల చేస్తాడు అని అడిగారు. ఎందుకు విడుదల చెయ్య కూడదు, తెలుగు సినిమాలు పండగకి విడుదల చెయ్యడం మంచిదే కదా,” అని చెప్పారు ప్రసన్న.