భావ ప్రకటనా స్వేచ్ఛను వినియోగించుకునేందుకు ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాలు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఒక అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, విమర్శనాత్మకంగా స్పందించడం వరకూ అభ్యంతరం ఉండదు. ట్విటర్ వేదికగా ఎక్కువగా ఇలాంటి అభిప్రాయాలే వ్యక్తమవుతుంటాయి. కానీ.. కొందరు కొన్ని సందర్భాల్లో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ అభాసుపాలవుతుంటారు. అలాంటి ట్వీట్ చేసి బాలీవుడ్ నటి రిచా చద్దా తాజాగా విమర్శల పాలైంది. చివరకు అదే ట్విటర్ వేదికగా క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఆమె ఏం ట్వీట్ చేసిందో, ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందో చూద్దాం.
నటనలో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న రిచా చద్దా ఇండియన్ ఆర్మీలోని సీనియర్ ఆర్మీ అధికారి ప్రకటన పట్ల ట్విట్టర్‌లో స్పందించిన తీరు విమర్శలకు తావిచ్చింది. అక్టోబర్ 27న శౌర్య దివాస్ సందర్భంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ భారత్‌కు వెన్నుపోటు పొడిచిందని.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నివసిస్తున్న వారిపై ఉన్మాద చర్యలకు దిగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ సొంతం చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పందిస్తూ.. భారత ప్రభుత్వం ఏ ఆదేశాలిచ్చినా ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఉపేంద్ర ద్వివేది చేసిన ఈ ప్రకటనను ఒక ట్విట్టర్ యూజర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసుకున్నాడు. ఆ పోస్ట్‌పై రిచా చద్దా స్పందిస్తూ.. ‘‘Galwan says hi’’ అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడ్డారు. తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ ప్రాంతంలో చైనా, భారత్ సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారని, వారి ప్రాణ త్యాగాన్ని అపహాస్యం చేసేలా పోస్ట్ పెట్టడం ఏంటని రిచా చద్దాపై నెటిజన్లతో పాటు బీజేపీ, శివసేన నేతలు కూడా కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. రిచా చద్దా చేసిన ఈ ట్వీట్ కచ్చితంగా భారత సైన్యాన్ని అవమానించడమేనని, ఆమె క్షమాపణ చెప్పాలని ట్విట్టర్‌లో పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమైంది. దీంతో.. ట్వీట్ పెట్టిన గంటల వ్యవధిలోనే ఆమె క్షమాపణ చెబుతూ ట్విట్టర్‌లో ఒక లేఖను విడుదల చేశారు.