Tuesday, January 21, 2025
spot_img
HomeTELANGANAబుగ్గారం పోలీస్ స్టేషన్ ముందు జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి పై దాడికి రెండేండ్లు

బుగ్గారం పోలీస్ స్టేషన్ ముందు జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి పై దాడికి రెండేండ్లు

జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్ ముందు జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి పై జరిగిన హత్యాయత్నం దాడికి నేటితో రెండేండ్లు పూర్తి అవుతుంది. పలు అవినీతి – అక్రమాలను, దోపిడీని బయట పెట్టి చట్ట బద్ధంగా న్యాయ పోరాటం చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి పై 2022 మే 1న సాక్షాత్తు బుగ్గారం పోలీస్ స్టేషన్ లోనే గేటు ముందు హత్యా యత్నం దాడి జరిగింది. బాధితుడు చుక్క గంగారెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సందీప్ ఐదుగురిపై కేసు నమోదు చేశారు. బుగ్గారం వైస్ ఎంపిపి జోగినిపెల్లి సుచెందర్ రావు, మహిళా సర్పంచ్ భర్త మూల శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ మామయ్య మూల శంకరయ్య, నగునూరి శ్రీనివాస్ గౌడ్, కండ్లె అనిల్ అనే ఐదుగురు వ్యక్తులు జర్నలిస్ట్ పై దాడి చేసిన ఘటనలో నిందితులుగా ఉన్నారు.

దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినందులకు రాజకీయ ఒత్తిళ్లతో అప్పటి ఎస్సై సందీప్ ను బదిలీ చేశారు. ఆ తర్వాత వచ్చిన ఎస్సై తీగల అశోక్ అధికార పార్టీ నేతల ప్రలోభాలకు లోనై తనకు అన్యాయం చేస్తూ, కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా ఎస్పీకి చుక్క గంగారెడ్డి అప్పట్లోనే పిర్యాదు చేశారు.
అంతే కాకుండా కేసునుండి ప్రధాన వ్యక్తుల పేర్లను డిలీట్ చేయడానికి ఒప్పుకోవాలని, లేకుంటే నీపైననే రౌడి షీట్ కేసు నమోదు చేసి లోపల వేస్తానని ఎస్సై బెదిరిస్తున్నారని చుక్క గంగారెడ్డి జిల్లా ఎస్పీ కి అప్పట్లోనే ఇచ్చిన పిర్యాదులో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర డిజిపి వరకు కూడా ఎస్సై తీగల అశోక్ పై చుక్క గంగారెడ్డి పిర్యాదులు చేశారు. సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తులు కూడా చేశారు. ఇప్పటికీ కూడా విచారణ పేరుతో ఆ పిర్యాదులు అన్నీ ధర్మపురి పోలీస్ సర్కిల్ ఆపీస్ లో పెండింగ్ లో ఉన్నాయని చుక్క గంగారెడ్డి ఆరోపించారు.

బుగ్గారం వైస్ ఎంపిపి జోగినిపెల్లి సుచెందర్ రావు, మహిళా సర్పంచ్ భర్త మూల శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ మామయ్య మూల శంకరయ్య లకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని ఎస్సై తీగల అశోక్ కోర్టుకు చార్జి షీట్ దాఖలు చేశారు. దాన్ని సవాల్ చేస్తూ వారే అసలైన నిందితులు అని చుక్క గంగారెడ్డి ధర్మపురి న్యాయస్థానంలో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆ కేసు ధర్మపురి న్యాయస్థానంలో కొనసాగుతోంది. ఎస్సై తీగల అశోక్ కావాలనే దురుద్దేశ్యంతో నిందితుల ప్రలోభాలకు లోనై కోర్టుకు తప్పుడు సమాచారంతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారని చుక్క గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ స్థానం పై తనకు నమ్మకం ఉందని ఎప్పటికైనా తనకు న్యాయం జరిగి తీరుతుందని చుక్క గంగారెడ్డి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విధుల్లో నిర్లఖ్యం వహించి, రాజకీయ, ఇతర ప్రలోభాలకు లోనై కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి కేసును నీరు గార్చే ప్రయత్నం చేయడమే కాకుండా తనను ఫోన్ కాల్స్ ద్వారా వేధించిన ఎస్సై తీగల అశోక్ పై చట్టపరమైన, శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని చుక్క గంగారెడ్డి కోరారు. లేని పక్షంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ను ఆశ్రయిస్తామని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు. తనపై జరిగిన హత్యాయత్నం దాడి వెనుక మరో ఇద్దరు కీలక వ్యక్తులు కూడా ఉన్నట్లు ఈ మధ్యలోనే తెలిసిందని ఆయన అన్నారు. వారిపై కూడా పోలీస్ ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తూ, వీలును బట్టి న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments