జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన ప్రముఖ విద్యావేత్త, ఉద్యమ కలాకారుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు నక్కరాజు డాక్టరేట్ అవార్డ్ కు ఎంపికయ్యారు. ఆసియా ఇంటర్ నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు నక్క రాజు డాక్టరేట్ అవార్డ్ కు ఎంపికైనట్లు జారీ చేసిన ఉత్తర్వుల ప్రతి మంగళ వారం ఆయనకు అందింది. గత 18 సంవత్సరాల నుండి అటు విద్యారంగంలో కొనసాగుతూ శ్రీ గ్లోబల్ హైస్కూల్ ను బుగ్గారంలో స్థాపించి, ఇటు కళా రంగంలో ప్రాణదాత (జనని) వేదిక ద్వారా గత 12 సంవత్సరలుగా ప్రతిఏటా మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆరుసార్లు 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం నిర్వహిస్తూ వస్తున్నారు. ఎంతోమంది యువతీ యువకులకు స్ఫూర్తిదాయకంగా విద్యా- ఆధ్యాత్మిక, భక్తి రంగాల్లో నక్క రాజు చేస్తున్న ఎనలేని సేవలను గుర్తించి ఆసియా ఇంటర్నేషనల్ సాంస్కృతిక పరిశోధన విశ్వవిద్యాలయం డాక్టరేట్ అవార్డు కు ఎంపిక చేశారు.
ఈ ఎంపికలో యూనివర్సిటీ కో – ఆర్డినెటర్, స్పూర్తి సర్వీసెస్ సోసైటీ ఇండియా ఎన్జీవో చైర్మన్ లయన్ డాక్టర్ ఆకుల రమేష్, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ లు ప్రోద్భలం అందించారు. జూలై 13న హైదరాబాద్ లోని సరస్వతి పరిషత్ ఆడిటోరియంలో నిర్వహించనున్న అవార్డుల ప్రధానోత్సవంలో అతిరథ మహారధుల మధ్య ఈ అవార్డు అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. అనేక మంది ప్రముఖులు, ప్రజలు, భక్తులు నాతో అన్ని రంగాలలో సహకరించడం వల్లనే నాకొక గుర్తింపు, ఈ డాక్టరేట్ అవార్డు లభించిందని అవార్డ్ గ్రహీత, గ్లోబల్ హైస్కూల్ కరస్పాండెంట్ నక్కరాజు తెలియజేశారు. వారందరికీ, ఈ అవార్డ్ సెలెక్షన్ కు ప్రోత్సాహాన్ని అందించిన స్ఫూర్తి ప్రదాతలకు ఈ సందర్భంగా నక్క రాజు కృతజ్ఞతలు తెలియజేశారు.