భారత దేశం అప్పుల కుప్పలా మారుతోంది. 2022 సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ప్రభుత్వ అప్పుల భారం ఏకంగా రూ.147.19 లక్షల కోట్లకు చేరింది. భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 89.1 శాతానికి సమానం. జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే ఇది 0.8 శాతం ఎక్కువ. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఈ వివరాలు విడుదల చేసింది. ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పుల్లో దాదాపు 29.6 శాతం ఐదేళ్లలోపు చెల్లించాల్సిన రుణ పత్రాల రూపంలో ఉంది. సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల్లోనే కేంద్ర ప్రభుత్వం రుణ పత్రాల జారీ ద్వారా రూ.4.06 లక్షల కోట్ల అప్పులు చేసింది. ఈ మూడు నెలలకు లక్ష్యంగా పెట్టుకున్న రూ.4.22 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రూ.16,000 కోట్లు తక్కువ. రెండో త్రైమాసికంలో సేకరించిన రూ.4.06 లక్షల కోట్లలో రూ.92,371.15 కోట్లు పాత అప్పుల చెల్లింపులకే సరిపోయింది.
పెరుగుతున్న వడ్డీ రేటు
అప్పుల సేకరణతో పాటు ఆ అప్పులపై చెల్లించే వడ్డీ రేటూ పెరుగుతోంది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రుణ పత్రాలపై సగటు వడ్డీ రేటు 7.23 శాతం ఉంటే సెప్టెంబరు నాటికి అది 7.33 శాతానికి చేరింది. ద్రవ్యోల్బణం కట్టడి కోసం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కీలక రెపో రేటు పెంచుకుంటూ పోవడం ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం జారీ చేసే రుణ పత్రాల సగటు కాలపరిమితి 15.69 సంవత్సరాల నుంచి 15.62 సంవత్సరాలకు తగ్గిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.