మంచు మోహన్‌బాబు, మంచు లక్ష్మి తొలి సారిగా కలసి నటించిన సినిమా ‘అగ్ని నక్షత్రం’. వంశి కృష్ణ మళ్ల దర్శకత్వం వహంచారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్స్ కలసి నిర్మించాయి. ఈ సినిమాలోని ‘తెలుసా తెలుసా’ సాంగ్‌ను తాజాగా సమంత విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సామ్‌తో తనకున్న అనుబంధాన్ని మంచు లక్ష్మి ప్రేక్షకులతో పంచుకున్నారు.
మంచు లక్ష్మి మాట్లాడుతూ..‘‘వ్యక్తిత్వానికి ప్రతిరూపం సమంత. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను ఆమె ఎదుర్కొంది. మరొకరు ఆమె స్థానంలో ఉంటే కుంగిపోయేవారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా సామ్ తనను తాను మలుచుకున్న తీరు అందరికి స్ఫూర్తినిస్తుంది. ఇటువంటి ధైర్యవంతురాలైన మహిళ నా సినిమాలోని పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది’’ అని మంచు లక్ష్మి తెలిపారు. సమంత కూడా మాట్లాడారు. మంచి పాటను అందించారని ‘అగ్ని నక్షత్రం’ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. ‘అగ్ని నక్షత్రం’ లో ప్రముఖ మలయాళ నటుడు సిద్ధిక్, యువ హీరో విశ్వంత్, చైత్ర శుక్ల కీలక పాత్రలు పోషించారు. అచ్చు రాజమణి సంగీతం అందించారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.