చిగురుపాటి జయరాం హత్య కేసులో తీర్పు
హైదరాబాద్ సిటీ/బంజారాహిల్స్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పారిశ్రామికవేత్త, ఎన్‌ఆర్‌ఐ చిగురుపాటి జయరాం హత్య కేసులో ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డికి జీవితఖైదు పడింది. నాంపల్లి మొదటి సెషన్స్ కోర్టు ఆయన్ను దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. అలాగే, ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా 11 మందినీ నిర్దోషులుగా ప్రకటించింది. కోర్టు తీర్పు విన్న రాకేశ్ రెడ్డి కంటతడి పెట్టారు. తన తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారని.. శిక్ష తగ్గించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. చిగురుపాటి జయరాం హత్య కేసుకు సంబంధించి అప్పట్లో రాకేశ్ రెడ్డిపై మూడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. 2019 జనవరి 31న జరిగిన జయరామ్ హత్యపై జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. దర్యాప్తు అధికారులు అన్ని కోణాల్లో విచారణ జరిపి 320 పేజీల చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. 72 మంది సాక్షులను పేర్కొనగా కేవలం 48 మంది మాత్రమే కోర్టుకు వచ్చి వాగ్మూలం ఇచ్చారు. నాలుగేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు తీర్పును వెలువరించింది.
మొదటి నుంచీ నేర ప్రవృత్తి
జూబ్లీహిల్స్‌లో ఉంటూ సంపన్నుడిగా చెప్పుకొనే రాకేశ్ రెడ్డికి మొదట నుంచీ నేరప్రవృత్తి ఉందని పోలీసు వర్గాల సమాచారం. తనకు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పరిచయాలు ఉన్నాయని మభ్యపెట్టి.. ఎన్నికల్లో పోటీకి టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఓ రియల్టర్‌ను బెదిరించి డబ్బు వసూలు చేసినట్టు కూకట్‌పల్లి పీఎ్‌సలోనూ కేసు నమోదైంది. జయరాం హత్య కేసులో జైలుకెళ్లాక కూడా.. బయట ఉన్న తమ మనుషుల ద్వారా సాక్షులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను రాకేశ్ బెదిరించాడనే ఆరోపణలున్నాయి.