భారత దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అంటే వచ్చే లోక్ సభ ఎన్నికలలో బిజేపీని ఓడించాలని, ఎన్నికలలో బిజేపీని ఓడించడమే కాదు దాని దుర్మార్గపు భావజాలాన్ని ప్రజల నుండి దూరం చేయడం కోసం ప్రతి కమ్యూనిస్టు కార్యకర్త కృషి చేయాలని భారత కమ్యునిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు- పార్టీ వైఖరి అంశంపై జిల్లా స్థాయి సదస్సు కాగజ్ నగర్ పట్టణంలో రిటైర్డ్ ఉద్యోగులు భవనంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూశన రాజన్న అద్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజేపీ సర్కార్ త్రిశూల తంత్రాన్ని పాటిస్తూ భారత రక్షణ, విద్యా, పరిపాలన రంగాలపై దాడి చేస్తుందని, ప్రశ్నించే గొంతులపై దాడి చేస్తుందని ప్రతిపక్షాలను ED, CBI, IT దాడులతో బెదిరింపులకు గురిచేస్తుందని, ఆకలి నుండి ఆనందం వరకు ఆంక్షలు విధిస్తుందని ఆవు మాంసం తింటున్నారని పేరుతో అక్లక్ కుటుంబం పై దాడి చేసి చంపారని, తర్వాత ఎంక్వయిరీ లో అది ఆవు మాంసం కాదని తేలింది అన్నారు. ఇంకా అనేకమంది మేధావులపై దాడులు చేస్తుందని ఉపా చట్టాన్ని ప్రయోగించి జైల్లలో పెడుతుందని అన్నారు. రాజ్యాంగ మూల సూత్రాలైన ఫెడరల్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాల హక్కులను కాల రాస్తుందని, సామాజిక న్యాయన్ని కాపాడాల్సిన ప్రభుత్వం దళితులు గిరిజనులపై దాడులు చేస్తున్న వాళ్లకు మద్దతునిస్తుందని దుయ్యబట్టారు. మహిళలపై దాడులు చేస్తున్న వారి పక్షాన బిజెపి నిలుస్తుందని ఆర్థిక స్వావలంబనను దెబ్బతీస్తూ కోటీశ్వరులకు రాయితీలు ప్రకటిస్తుందని, పేదలకు మొండి చేయి చూపిస్తుందని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత శతకోటీశ్వరుల సంఖ్య పెరిగిందని, నిరుద్యోగం పెరిగిందని, కొత్త పరిశ్రమల స్థాపన జరగలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందని హక్కుల కోసం మాట్లాడిన వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని విమర్శించారు. ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల అవినీతి బిజెపి చేసిందని దేశాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపిని ఓడించాలని, సిపిఎం పోటీ చేస్తున్న స్థానాల్లో సిపిఎం అభ్యర్థులను, వామపక్ష అభ్యర్థులను, ఇండియా కూటమిని బలపరచాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంటులో ఇండియా కూటమి అభ్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట శ్రీనివాస్, దుర్గం దినకర్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ముంజం ఆనంద్ కుమార్, ముంజం శ్రీనివాస్, గోడిసెల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.