చెన్నై: ‘‘నా శరీర రంగు గురించి కొందరు అదే పనిగా విమర్శలు చేస్తున్నారు. నేను నల్లగా ఉన్నానని అంటున్న ప్రత్యర్థులను అగ్గిలా మారి వణికిస్తా’’ అని గవర్నర్ తమిళిసై హెచ్చరించారు. చెన్నై తండయార్పేటలోని బాలికల ప్రైవేటు పాఠశాలలో శనివారం జరిగిన వార్షికోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థినులకు బహుమతులు పంపిణీ చేసి మాట్లాడారు. తన రంగు నలుపు అని, తన నుదురు బట్టతలలా ఉందని కొంతమంది హేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను నలుపు అంటే అగ్గిలా మారుతానని, బట్టతల ఉన్న వ్యక్తి అంటూ విమర్శించేవారు సైతం ఓర్వలేనంతగా ఉన్నత స్థాయికి చేరతానని వ్యాఖ్యానించారు. తనపై విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశారు.