జమ్మికుంట ఆటోనగర్ సమీపంలో సర్వే నంబర్ 275, 76, 77, 78 లో 2006 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 300 నిరుపేద కుటుంబాలకు నివాస స్థలాలు మంజూరు చేసి పట్టాలు ఇచ్చింది. ఈ స్థలాలలో కొంతమంది ఆర్థిక స్తోమత కలిగిన వారు నిర్మాణాలు చేపట్టారు. స్తోమత లేని వారు జమ్మికుంటలో కిరాయి ఇండ్లలో జీవనం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డంపింగ్ యార్డ్ల నిర్మాణంలో భాగంగా నిరుపేదలకు పంపిణీ చేసిన నివేషణ స్థలాలను ఆక్రమించి ఆ స్థలంలో డంపింగ్ యార్డ్ నిర్మించి చెత్తను పారబోస్తున్నారు. విషయం తెలుసుకున్న సదరు బాధితులు అప్పటి BRS ప్రభుత్వంలోని ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన ఎవరూ పట్టించుకోకపోగా, చీదరింపులకు గురయ్యామని తెలిపారు. ఈ సందర్భంగా నివాస స్థలాలు కోల్పోయిన పలువురు బాధితులు మాట్లాడుతూ 2006లో నిరుపేదలకు కేటాయించి ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. నేడు మళ్లీ నిరుపేదల సంక్షేమం కోరే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాబట్టి మాపై దయతలచి ఇక్కడినుండి డంపింగ్ యార్డ్ ను తక్షణమే తరలించాలని, మా నివాస స్థలాలు మాకు అప్పగించి న్యాయం చేయాలని లేనియెడల ఇక్కడే మేము టెంటు వేసుకొని నిరాహార దీక్షకు దిగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో, నాగిశెట్టి వెంకటేశ్వర్లు, చిట్టి పెద్దులు, సమ్మయ్య, శంకర్, అనిల్, గూడపు రమ, రాజలక్ష్మి, కనకం సరోజన, మల్లీశ్వరి, చిట్యాల విజయలక్ష్మి, ఇల్లందుల శారద, తదితరులు పాల్గొన్నారు.