Tuesday, January 21, 2025
spot_img
HomeBUSINESSముకేశ్‌ సారథ్యానికి 20 ఏళ్లు

ముకేశ్‌ సారథ్యానికి 20 ఏళ్లు

న్యూఢిల్లీ: దేశంలో అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ఎండీ, చైర్మన్‌గా ముకేశ్‌ అంబానీ బాధ్యతలు చేపట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఆర్‌ఐఎల్‌ వ్యవస్థాపక చైర్మన్‌ ధీరూభాయ్‌ అంబానీ ఆకస్మిక మరణంతో ముకేశ్‌ కంపెనీ పగ్గాలు చేపట్టారు. ఆయన సారథ్యంలో రిలయన్స్‌ ఆదాయం 17 రెట్లు పెరగగా.. లాభాలు 20 రెట్లు ఎగబాకాయి. అంతేకాదు, ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. ధీరూభాయ్‌ 2002లో గుండెపోటుతో మరణించారు. దాంతో ఆయన పెద్ద కుమారుడు ముకేశ్‌.. కంపెనీ ఎండీ, చైర్మన్‌గా, చిన్న కుమారుడు అనిల్‌ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య ఆధిపత్య పోరు వ్యాపార విభజనకు దారి తీసింది. ముకేశ్‌కు ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పెట్రోకెమికల్‌ వ్యాపారాలు దక్కగా.. అనిల్‌కు టెలికమ్యూనికేషన్స్‌, విద్యుత్‌ ఉత్పత్తి, ఆర్థిక సేవల విభాగాలు లభించాయి. కాగా, ముకేశ్‌ 20 ఏళ్ల సారథ్యంలో ఆర్‌ఐఎల్‌ టెలికాం వ్యాపారంలోకి పునఃప్రవేశించడంతోపాటు రిటైల్‌, పునరుత్పాదక ఇంధన రంగాల్లోకి సైతం అడుగుపెట్టింది. కొవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో టెలికాం, రిటైల్‌ విభాగాల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రికార్డు స్థాయిలో రూ.2.5 లక్షల కోట్లు సమీకరించింది. కాగా, గడిచిన రెండు దశాబ్దాల్లో తమ్ముడు అనిల్‌ అంబానీ అప్పుల భారంతో పూర్తిగా దివాలా తీశారు. టెలికాం, పవర్‌ నుంచి ఆర్థిక సేవల విభాగమైన రిలయన్స్‌ క్యాపిటల్‌ వరకు అన్నింటినీ కోల్పోయారు.

ముకేశ్‌ నేతృత్వంలో మైలురాళ్లు..

  • మార్కెట్‌ విలువ ఏటా 20.6 శాతం చొప్పున వృద్ధి చెందుతూ వచ్చింది. 2002 మార్చిలో రూ.41,989 కోట్లుగా ఉన్న మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 2022 మార్చి నాటికి రూ.17.82 లక్షల కోట్లకు పెరిగింది.
  • ఆదాయం ఏటేటా 15.4 శాతం చొప్పున పెరిగింది. 2001-02లో రూ.45,411 కోట్లుగా ఉన్న వార్షికాదాయం.. 2021-22లో రూ.7,92,756 కోట్ల స్థాయికి చేరుకుంది.
  • నికర లాభం ఏటా 16.3 శాతం చొప్పున పెరిగి. రూ.3,280 కోట్ల (2001-02) నుంచి రూ.67,845 కోట్లకు (2021-22) చేరింది.
  • ఎగుమతులు ఏటా 16.9 శాతం చొప్పున పెరుగుతూ రూ.11,200 కోట్ల (2001-02) నుంచి రూ.2,54,970 కోట్లకు (2021-22) చేరాయి.
  • మొత్తం ఆస్తులు ఏటా 18.7 శాతం చొప్పున వృద్ధి చెందాయి. 2002 మార్చిలో రూ.48,987 కోట్లుగా ఉండగా.. 2022 మార్చి నాటికి రూ.14,99,665 కోట్లకు పెరిగాయి.
  • నెట్‌వర్త్‌ 17 శాతం చొప్పున పెరిగింది. 2002 మార్చిలో రూ.27,977 కోట్లుగా ఉండగా.. 2022 మార్చి నాటికి రూ.6,45,127 కోట్లకు చేరుకుంది.
  • గడిచిన రెండు దశాబ్దాల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు విలువ రూ.17.4 లక్షల కోట్లు పెరిగింది. అంటే, ఏడాదికి సగటున రూ.87,000 కోట్ల చొప్పున పెరిగింది.
  • మోతీలాల్‌ ఓస్వాల్‌ 26వ వార్షిక సంపద సృష్టి అధ్యయన నివేదిక ప్రకారం.. 2016-21 మధ్యకాలంలో రిలయన్స్‌ అతిపెద్ద సంపద సృష్టికర్తగా (రూ.10 లక్షల కోట్లు) నిలిచింది.
  • 2006లో రిటైల్‌ విక్రయ వ్యాపారంలోకి ప్రవేశించిన రిలయ న్స్‌ 2016లో టెలికాంలోకి, 2021లో కొత్త ఇంధన వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం రిలయన్స్‌ రిటైల్‌ దేశంలోనే అతిపెద్ద రిటైల్‌ కంపెనీ. టెలికాం విభాగమైన రిలయన్స్‌ జియో కూడా దేశంలో నం.1 మొబైల్‌ సేవల కంపెనీ.
  • 2002లో రిలయన్స్‌కు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఒకే ఒక ఆయిల్‌ రిఫైనరీ ఉండేది. ప్రస్తుతం జామ్‌నగర్‌ రిఫైనరీ కాంప్లెక్స్‌ ప్రపంచంలోనే అతిపెద్దది. 20 ఏళ్లలో కంపెనీ చమురు శుద్ధి సామర్థ్యం రెట్టింపైంది.
  • కొత్త ఇంధన రంగంలో రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు గత ఏడాది రిలయన్స్‌ ప్రకటించింది. ఈ పెట్టుబడులతో జామ్‌నగర్‌లో 5 ఇంటిగ్రేటెడ్‌ గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనుంది.
  • 2007లో ముకేశ్‌ అంబానీ కుటుంబ సంపద రూ.లక్ష కోట్లు దాటింది. ఆ సమయానికి భారత్‌లో రూ.లక్ష కోట్లకు పైగా ఆస్తి కలిగిన ఏకైక వ్యక్తి ముకేశే. అప్పటి నుంచి 2021 వరకు ఆయనే దేశంలో అత్యంత సంపన్నుడిగా కొనసాగారు.

2047 నాటికి భారత్‌ @ 40 లక్షల కోట్ల డాలర్లు

ప్రస్తుత శతాబ్దం భారత్‌దేనన్న ముకేశ్‌ అంబానీ.. 2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 40 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోనుందన్నారు. ఆర్‌ఐఎల్‌ వ్యవస్థాపకులు ధీరూభాయ్‌ అంబానీ 90వ జన్మదినం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన వర్చువల్‌ ప్రసంగంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 5,000 ఏళ్ల భారత చరిత్రలోని వచ్చే పాతికేళ్లలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఆర్‌ఐఎల్‌ భవిష్యత్‌లోనూ మర్రి చెట్టులా విస్తారంగా వృద్ధి చెందనుందన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments