జోగులాంబ గద్వాల జిల్లాలో అనేక గ్రామాల్లో ముస్లిం మైనార్టీలకు స్మశాన వాటికలు లేవని, కొన్ని గ్రామాల్లో ఉన్న వాటికి సరైన హద్దులు లేకపోవడంతో అంత్యక్రియల సమయంలో వివాదాలు చెలరేగుతున్నాయని వీటిని సరి చేయడానికి రెవెన్యూ యంత్రాంగం చొరవ చూపాలని మైనార్టీ నాయకులు, ఆవాజ్ కమిటీ మరియు అఖిలపక్షం తరఫున జాయింట్ కలెక్టర్ లక్ష్మీనారాయణ కు నేడు వినతి పత్రం సమర్పించారు. అనేక గ్రామాల్లో స్మశాన వాటికలు సొంతంగా కొనుగోలు చేసి స్థిరపరచడానికి సర్వే చేయించడానికి రెవెన్యూ అధికారులు సహకరించక పోడంతో వివాదాలు చెలరేగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని గ్రామాల్లో ముస్లీం స్మశాన వాటికలు లేవని ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెద్ద సంఖ్యలో మైనార్టీలు ఉన్న గ్రామాల్లో రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వమే కేటాయించవలసి ఉందని వారు తెలిపారు. ముస్లిం మైనార్టీల స్థితిగతుల పట్ల సచార్ కమిటీ నివేదికను అమలు పరచకపోవడం వల్లే ఇన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలని పేదరికంలో నిరుద్యోగంలో భూమిలేని నిరుపేదలుగా బతుకుతున్న ముస్లింల పట్ల స్మశానాల దగ్గర కూడా వివక్షత ఏమిటని వారు ప్రశ్నించారు. ముస్లిం మరియు క్రిస్టియన్ మతాల స్మశాన వాటికలను సరి చేయకపోవడం సోచనీయమని ఇప్పటికైనా కలెక్టర్ చొరవ తీసుకొని అన్ని గ్రామాల్లో ఎక్కడెక్కడ స్మశాన వాటికలు ఉన్నాయి, ఎక్కడ లేవన్నది సమగ్రమైన విచారణ జరిపించి రిపోర్టును తెప్పించుకోవాలని స్మశాన వాటికలు ఉన్న చోట సర్వే చేయించి కాంపౌండ్లు నిర్మించాలని, లేనిదగ్గర ప్రభుత్వమే స్థలాలని కేటాయించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిఖుర్ రెహమాన్, BRS రాష్ట్ర నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, మహమ్మద్ రహమతుల్లా, గట్టు నరసింహులు, ఉప్పేర్ నరసింహ, యునుస్, షరీఫ్, కొత్తపల్లి సుభాన్, పాల్వాయి హాజీ, ముస్తఫా, సాధత్, పెద్ద ఖాజా, అబ్దుల్ సుభాన్ భాష, అహ్మద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.



